కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:03 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నాలుగువారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీచేసింది.
వాటి అమలును నాలుగు వారాలు నిలిపేసిన హైకోర్టు
9 దాకా లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఆదేశం
సర్కారు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నాలుగువారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించిన ఎనిమిది జీవోలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకాల చట్టబద్ధతపై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి.. దాఖలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ.. ఈ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఆదేశించింది.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపించిన పిటిషనర్.. 2014 నుంచి ఈ పథకాలు అమలు చేస్తున్నారని.. తొలుత ఎస్సీ, ఎస్టీలకు ఆ తర్వాత బీసీలు, ఈబీసీలకు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పథకాల అమలుకు ఎలాంటి చట్టం లేదా చట్టబద్ధమైన ప్రొవిజన్లు లేవని పేర్కొన్నారు. ఈ పథకాల కింద లబ్ధిదారుల అర్హత, ఆదాయ పరిమితి వంటి అంశాలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది?
అనే ప్రశ్నికు సమాధానం లేదని.. వీటికి రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొన్నారు. చట్టం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ పవర్‌ను ఆధారంగా చేసుకుని అమలు చేస్తున్నారని.. అలా ప్రజల నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగంలోని 202 అధికరణకు విరుద్ధమని తెలిపారు. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలపై భారీగా నిధులు ఖర్చు చేశారని.. ఆ జీవోలు నిరవధికంగా కొనసాగడం చెల్లదని పేర్కొన్నారు.
దీనికి ధర్మాసనం.. ‘ఈ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీవోల చట్టబద్ధతపై వివరణ ఇస్తామని గత విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కౌంటర్లూ దాఖలు కాలేదు. మరింత సమయం కావాలని ప్రభుత్వ సహాయ న్యాయవాది కోరారు. ఈ నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీవోలపై స్టే విధిస్తున్నాం. ’ అని పేర్కొంటూ తదుపరి విచారణను 9కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News