Share News

ఆద్యంతం అక్రమాలే.. జగన్‌ జమానా ‘గ్రూప్‌-1’పై సిట్‌ నివేదిక

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:31 AM

గ్రూప్‌-1 పరీక్షలు రాయాలంటే.. అర్హత డిగ్రీ ఉండాలి. కానీ మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఎవరితో చేయించారో తెలుసా..? టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారితో, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో కానిచ్చేశారు.

ఆద్యంతం అక్రమాలే.. జగన్‌ జమానా ‘గ్రూప్‌-1’పై సిట్‌ నివేదిక
APPSC Group 1

  • జగన్‌ జమానా ‘గ్రూప్‌-1’పై సిట్‌ నివేదిక

  • ఐపీఎస్‌ ఆంజనేయులు పాత్ర సుస్పష్టం

  • పీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో యథేచ్ఛగా ఉల్లంఘనలు

  • టెన్త్‌, ఇంటర్‌ చదివినవారు, సెక్యూరిటీ గార్డులు,

  • గృహిణులతో మెయిన్స్‌ మూల్యాంకనం

  • హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం అంశం దాచివేత

  • ఆ తర్వాత మూడో దశలోనూ అక్రమాలు

  • మెయిన్స్‌ జవాబు పత్రాల్లో అడ్డగోలుగా మార్పులు

  • 28 శాతం మంది పేపర్లలో వేరే ఇంకు వాడకం

  • చీఫ్‌ ఎగ్జామినర్లతోనే నేరుగా మార్కుల్లో మార్పులు

  • ఇంటర్వ్యూలోనూ అసాధారణంగా మార్కులు

  • మెయిన్స్‌ పరీక్షల్లో టాపర్లకు తక్కువ మార్కులు

  • తక్కువ వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో ఎక్కువ

  • ఉద్యోగాలు కోల్పోయిన కొందరు అభ్యర్థులు

  • గ్రూప్‌-1పై హైకోర్టుకు 10 వేల పేజీల నివేదిక

గ్రూప్‌-1 పరీక్షలు రాయాలంటే.. అర్హత డిగ్రీ ఉండాలి. కానీ మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఎవరితో చేయించారో తెలుసా..? టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారితో, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో కానిచ్చేశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..! జగన్‌ జమానాలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల్లో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అక్రమాలు జరిగినట్టు సిట్‌ తేల్చింది.


గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం మూడుసార్లు జరగ్గా.. ప్రతిదశలోనూ ఉల్లంఘనలు జరిగాయి. తుది మూల్యాంకనంలోనూ అడ్డగోలుగా వ్యవహరించారు. నీలం, నలుపు రంగు బాల్‌పాయింట్‌ పెన్నులకు బదులు ఇతర ఇంకు పెన్నులు వాడారు. ఇష్టానుసారం జవాబుపత్రాల్లో మార్పులు చేశారు. దీంతో కొందరు అభ్యర్థులకు మార్కులు తగ్గాయి.

ఆఖరున ఇంటర్వ్యూలోనూ చాలా చిత్రాలు జరిగాయి. మెయిన్స్‌ రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చాయి. మెయిన్స్‌లో తక్కువ మార్కులు వచ్చినవారికేమో ఇంటర్వ్యూలో భారీగా మార్కులు వేశారు. ఫలితంగా కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు.


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అనుకోవచ్చు. కానీ మళ్లీ మళ్లీ అవే తప్పులు జరిగితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవే అవుతాయి. 2018 గ్రూప్‌-1 నిర్వహణ అంశంలో ఇదే జరిగింది. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో నిగ్గు తేల్చింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించింది. 10,720 పేజీల సమగ్ర నివేదికను తాజాగా హైకోర్టుకు సమర్పించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పత్రాల మూల్యాంకనం మూడుసార్లు జరిగితే ప్రతి దశలోనూ అక్రమాలే జరిగాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ రెండోసారి మూల్యాంకనం చేసిన హాయ్‌ల్యాండ్‌లోనే అక్రమాలు జరిగాయని అంతా భావిస్తుండగా, తుది ఫలితాల్లోనూ తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. తుది ఫలితాల ద్వారా ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల మెయిన్స్‌ పరీక్షల మార్కులను తారుమారు చేసినట్లు వెల్లడించింది. ఇలా వైసీపీ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం, ఇంటర్వ్యూల్లో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయి.


సిట్‌ నివేదికలోని కీలక అంశాలు...

నాడు ఏం జరిగిందంటే...

2018 డిసెంబరు 31న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2019 మే 26న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. 2020 డిసెంబరులో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. నిబంధనల ప్రకారం మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం జరగాలి. కానీ కోవిడ్‌ ఉందన్న కారణంతో డిజిటల్‌ మూల్యాంకనం చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా 3నెలల్లో మాన్యువల్‌ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 2021 అక్టోబరు నుంచి 2022 మే 19 వరకు ఏపీపీఎస్సీ మాన్యువల్‌గా మూల్యాంకనం జరిపింది. అసలు ట్విస్ట్‌ ఇక్కడే ప్రారంభమైంది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు నిబంధనలు తుంగలో తొక్కారు. ఏపీపీఎస్సీ కార్యాలయం లేదా ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన మూల్యాంకనాన్ని గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌కు తరలించారు. 84 రోజుల పాటు జవాబుపత్రాలు అక్కడే ఉంచి వారికి నచ్చిన వారితో మార్కులు వేయించారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు ఇవ్వాలని భావించిన సమయంలో కొత్తగా ఏపీపీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన దాంతో సంబంధం లేకుండా మరోసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. ఆయన ఆదేశాలతో 2022 మే నుంచే మూడోసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేపట్టారు. ఇది ఏపీపీఎస్సీ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగింది. 2022 జూలై 5న తుది ఫలితాలను కమిషన్‌ ప్రకటించింది. 325 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా 165మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2024లో మళ్లీ వాదనలు విన్న న్యాయస్థానం మెయిన్స్‌ పరీక్షలు మొత్తం రద్దు చేసి 6నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై కమిషన్‌ అప్పీలుకు వెళ్లింది. 2025 ఏప్రిల్‌లో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి ఫిర్యాదుతో మళ్లీ కేసు నమోదైంది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది.


తొలి దశ మూల్యాంకనం

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మాన్యువల్‌గానే మూల్యాంకనం చేయాలి. కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీటీ ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ మూల్యాంకనం చేపట్టారు. అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్‌ ప్రొ.ఉదయభాస్కర్‌కు చెప్పకుండానే ఈ ప్రక్రియ ప్రారంభించారు. 48,442 జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసేవారికి పంపారు. ఫలితాలను 2021 ఏప్రిల్‌లో ప్రకటించారు. 326 మంది 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారిలో 189 ఇంగ్లిష్‌ మీడియం, 137 మంది తెలుగు మీడియం అభ్యర్థులున్నారు. అయితే మూడోసారి నిర్వహించిన తుదిదశ ఫలితాల్లో ఇంటర్వ్యూలకు 35మంది మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఎంపికయ్యారు. పేపర్లు స్కాన్‌ చేసే సమయంలో బార్‌కోడ్‌లు తారుమారయ్యాయి. ఏపీటీ ఆన్‌లైన్‌తో పాటు ట్రూగ్రేడర్‌ ఎడ్యుసర్వీసెస్‌, స్టోన్‌మీడియా అడ్వైజరీ సర్వీసెస్‌ అనే రెండు ప్రైవేటు సంస్థలను ఏపీపీఎస్సీ ఎంపిక చేసుకుంది. టెండర్లు పిలవకుండా ఈ కంపెనీల ఎంపిక జరిగింది. మూల్యాంకనం చేసే వారిని ప్రైవేటు కంపెనీల ద్వారా ఎంపిక చేశారు. 158 మంది పేర్లను కమిషన్‌ ఆమోదించింది. అయితే చైర్మన్‌ సంతకం లేదు. మూల్యాంకన ప్రక్రియలో తొలుత పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వర్క్‌ను స్టోన్‌ మీడియా ఎండీ ఆకెళ్ల పేరి శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఆయన తన బంధువైన మహంకాళి రఘురామ్‌కు అప్పగించారు. అక్కడి నుంచి మాతృశ్రీ పాఠశాల ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి ద్వారా మూల్యాంకనం చేసేవారి ఎంపిక జరిగింది. మూల్యాంకనం చేసేవారి జాబితాలో లేని మరో 25 మంది కూడా ఎంపికయ్యారు. వీరిలో ప్రైవేటు లెక్చరర్లు, టీచర్లు ఉన్నారు.


రెండో దశ మూల్యాంకనం

డిజిటల్‌ మూల్యాంకనం చెల్లదని న్యాయస్థానం తేల్చడంతో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనాన్ని హాయ్‌ల్యాండ్‌లో చేయించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి హాయ్‌ల్యాండ్‌కు జవాబుపత్రాల తరలింపు కోసం అప్పటి గుంటూరు ఎస్పీకి పీఎస్‌ఆర్‌ లేఖ రాశారు. తన మిత్రులకు చెందిన కామ్‌సైన్‌ మీడియాకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఆ సంస్థకు వివిధ దశల్లో రూ.20.06 లక్షలు చెల్లించారు. మూల్యాంకనం కోసం 452 మంది సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేయగా వారిని ఉపయోగించుకోలేదు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివినవారు, టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్క్‌లు, గృహిణులతో మూల్యాంకనం చేయించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు బబ్లింగ్‌ చేసి, సంతకాలు చేశారు. 66మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మూల్యాంకనం చేశారు. ఎగ్జామినర్ల సంతకాలూ వారే చేశారు. డిజిటల్‌ మూల్యాంకనంలో పనిచేసిన మహంకాళి రఘురామ్‌ అనేవ్యక్తి ఇందులోనూ మార్కులు వేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రక్రియ పీఎస్‌ఆర్‌ ఆదేశాలతోనే జరిగిందని సిట్‌ విచారణలో కొందరు వెల్లడించారు. ఇందులో 736 మంది జవాబుపత్రాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ద్వారా పరిశీలించగా మొదటి మూల్యాంకనంలో ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో 165 మంది ఉన్నట్లు తేలింది. వైట్‌నర్‌ కూడా ఇందులో వాడినట్లు తేలింది. ఈ మొత్తం ప్రక్రియకు చైర్మన్‌ అనుమతి లేదు.


మూడో దశ మూల్యాంకనం

గౌతం సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత మూడోసారి మళ్లీ మాన్యువల్‌ మూల్యాంకనం చేయించారు. ఈ ప్రక్రియలోనూ అనేక జిమ్మిక్కులు చేశారు. మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం, ఇంటర్వ్యూ మార్కులపై అనుమానాలు తలెత్తేలా ఏపీపీఎస్సీ వ్యవహరించింది. రెండో దశ మూల్యాంకనంలో జవాబుపత్రాలపై సంతకాలు చేయడంతో మూడోదశ కోసం 49 వేల బార్‌కోడ్‌లను తిరిగి ప్రింటింగ్‌ చేయించారు. డేటా టెక్‌ అనే సంస్థ 48,442 బార్‌కోడ్‌లు సరఫరా చేసింది. 162 మంది నిపుణులను మూల్యాంకనం కోసం ఎంపిక చేశారు. డిజిటల్‌ మూల్యాంకనంలో ఎంపికైన అభ్యర్థులలో 202 మంది మూడో దశ మూల్యాంకనం ఫలితాల్లో లేరు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం నీలం, నలుపు రంగు బాల్‌పాయింట్‌ పెన్నులను మాత్రమే మూల్యాంకనంలో వినియోగించాలి. అవి కూడా ఏపీపీఎస్సీనే సమకూరుస్తుంది. కాగా కొందరు ఇతర ఇంకు పెన్నులు వాడినట్లు విచారణలో గుర్తించారు. 736 మంది అభ్యర్థుల పత్రాలను ఫోరెన్సిక్‌ పరిశీలించింది. అందులో 718(98శాతం) మంది ఓంఎఆర్‌ పత్రాల్లో మార్పులు(కరక్షన్‌) ఉన్నట్లు తేలింది. 89 మంది సంతకాలు సరిపోలలేదు. 46 పత్రాల్లో ఏపీపీఎస్సీ అనుమతించని ఇతర ఇంకు పెన్నులు వాడారు. నిబంధనల ప్రకారం వాల్యుయేటర్స్‌ మాత్రమే మార్కుల్లో మార్పులుంటే చేయాలి. కానీ 87 పత్రాల్లో చీఫ్‌ ఎగ్జామినర్లు మార్కుల్లో మార్పులు చేశారు.


కీలక అంశాలు

  • హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం చేసిన అంశాన్ని దాచిపెట్టారు.

  • కొన్ని ఓఎంఆర్‌ పత్రాలపై వేరే ఇంకుతో మార్పులు చేశారు.

  • నిర్మల కుమారి, జి.సోమశేఖర్‌, వి.రవికుమార్‌, వై.వెంకటేశ్వర్లు, ఎ.మునిశంకర స్వామి అనే ఎగ్జామినర్ల ప్రమేయం లేకుండానే కొన్ని పత్రాల మార్కుల్లో మార్పులు జరిగాయి.

  • ఎస్‌. గోవర్ధన్‌ నాయుడు, నాగిరెడ్డి వెంకట రమణారెడ్డి, బీవీ మురళీధర్‌ అనే చీఫ్‌ ఎగ్జామినర్లు తమకు తామే మార్కులు మార్చేశారు. ఇది మూల్యాంకన నిబంధనలకు విరుద్ధం.

  • ఒక హాల్‌ టికెట్‌ నంబరు పత్రంలో 13 మార్పులున్నాయి. దీంతో మొత్తం మార్కులు 105 నుంచి 89కి తగ్గాయి.

  • మరొక దాంట్లో 10 మార్పులు చేశారు. దీంతో 104 నుంచి 99కు మార్కులు తగ్గాయి.

  • ఒక అభ్యర్థి పత్రంలో 3 మార్పులు చేయడంతో మార్కులు 111 నుంచి 110కి తగ్గాయి.


సరిపోలని బార్‌కోడ్‌లు

జవాబుపత్రంలో ప్రతి పేజీకి బార్‌కోడ్‌ ఉంటుంది. మొదటి పేజీలో అభ్యర్థి వివరాలుంటాయి. కొందరు అభ్యర్థుల బార్‌కోడ్‌లు లోపలిపేజీలు, మొదటి పేజీకి సరిపోలలేదు. నిబంధనల ప్రకారం పేపర్లు మూల్యాంకనం చేసేవారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉండాలి. కానీ 47మంది వాల్యుయేటర్స్‌ పేర్లు ముందుగానే సోషల్‌ మీడియాలో కనిపించాయి.


మార్కుల్లో మతలబు ఏంటి?

  • మూడు బోర్డులు ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే మార్కుల్లో చాలా తేడాలు కనిపించాయి. మెయిన్స్‌ పరీక్షల్లో టాపర్లకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వచ్చాయి. మెయిన్స్‌లో మెరుగైన మార్కులు రానివారికి ఇంటర్వ్యూల్లో అసాధారణ మార్కులు వేశారు. దీనిపై సిట్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూల కారణంగా కొందరు ఉద్యోగాలు కోల్పోతే, మరికొందరు మంచి ఉద్యోగాలు సాధించలేకపోయారు.

  • మెయిన్స్‌ పరీక్షల్లో 404 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 73 మార్కులు వేశారు. ఫలితంగా 215 నుంచి 161 ర్యాంకుకు చేరారు. ఎంపీడీవో ఉద్యోగం వచ్చింది.

  • మెయిన్స్‌లో 409.5 మార్కులు సాధించిన అభ్యర్థి 72.5 ఇంటర్వ్యూ మార్కులు సాధించారు. ఫలితంగా ర్యాంకు 186 నుంచి 133కు చేరింది. డీఎస్పీ ఉద్యోగం వచ్చింది.


  • 411.5 మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 73 మార్కులు సాధించారు. దీంతో ర్యాంకు 167 నుంచి 133కు వచ్చింది. ఎక్సైజ్‌ ఏఈఎస్‌ ఉద్యోగం వచ్చింది.

  • 414.5 మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 72 మార్కులు వచ్చాయి. ఫలితంగా 151 నుంచి 94కు ర్యాంకు మెరుగుపడింది. ఎక్సైజ్‌ ఏఈఎస్‌ ఉద్యోగం వచ్చింది.

  • ఓ అభ్యర్థికి మెయిన్స్‌లో 446 మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో 49 మార్కులే వచ్చాయి. దీంతో 14 నుంచి 55కు ర్యాంకు పడిపోయింది. అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ ఉద్యోగం వచ్చింది.

  • మెయిన్స్‌లో 440.5 మార్కులొచ్చిన మరో అభ్యర్థికి ఇంటర్వ్యూలో 48 మార్కులే రావడంతో ర్యాంకు 20 నుంచి 81కు తగ్గింది. ఎంపీడీవో ఉద్యోగం వచ్చింది.

  • 426.5 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 53 మార్కులే వచ్చాయి. దీంతో ర్యాంకు 67 నుంచి 148కి తగ్గి, ఉద్యోగానికి ఎంపిక కాలేదు.

  • 425.5 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 47 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో ర్యాంకు 72 నుంచి 192కు పడిపోయింది. ఉద్యోగం రాలేదు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 06:54 AM