Share News

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!

ABN , Publish Date - Aug 15 , 2026 | 09:17 AM

ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)పై చిక్కుముడులు వీడాయి.

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!
HMDA, TDR policy

  • రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, ఎలివేటెడ్‌ కారిడార్లకు కూడా..

  • క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం

  • నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్‌ ఇచ్చినా చాలు..

  • రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ: ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)పై చిక్కుముడులు వీడాయి. హెచ్‌ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్‌ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్‌ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్‌లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్‌ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది.


ఏ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్‌ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్‌టాటా రేడియల్‌ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్‌ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్‌ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది.


ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీనే (హెచ్‌ఎండీఏ) టీడీఆర్‌ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్‌లను హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్‌ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది.


city1.2.jpgబిల్డ్‌నౌలోనే సింగిల్‌ బ్యాంకు

టీడీఆర్‌ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లోనే టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో ఎఫ్‌సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్‌ బ్యాంకును బిల్డ్‌ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్‌ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ పట్టించే చర్యలకు బిల్డ్‌నౌ ద్వారా అధికారులు చెక్‌ పెట్టనున్నారు.


50శాతం టీడీఆర్‌ ఇచ్చిన చాలు..

టీడీఆర్‌లకు డిమాండ్‌ పెంచడానికి ప్రభుత్వం బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో వీటిని వినియోగించడానికి గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు, డెవలపర్లకు భవన నిర్మాణ అనుమతులకు వెళ్లిన సందర్భంలో ఒకేసారి పెద్ద మొత్తంలో టీడీఆర్‌లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు, డెవలపర్లకు ప్రయోజనం కలిగేలా భవన నిర్మాణ అనుమతుల సందర్భంలో పొందుపర్చాల్సిన టీడీఆర్‌లలో 50శాతం సమకూరిస్తే సరిపోతుందని, మిగతా 50శాతం భవన నిర్మాణం పూర్తి చేసి అక్యూపెన్సీ సర్టిఫికెట్‌ను తీసుకునే సందర్భంలో పొందుపర్చాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


టీడీఆర్‌తో అధిక ప్రయోజనానికి అవకాశాలు

నగర అభివృద్ధిలో నష్టపోతున్న నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్‌లను అందించడమే గాకుండా.. అధిక ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. టీడీఆర్‌లను ఒకే సంస్థ జారీ చేయడం వల్ల నిర్వాసితులకు ఎలాంటి సందిగ్ధం ఉండదు. భవన నిర్మాణ అనుమతులప్పుడు టీడీఆర్‌ ఒకేసారి పొందుపర్చడం వల్ల ఏర్పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం మంచి పరిణామం. టీడీఆర్‌ అంశంలో ప్రభుత్వ నిర్ణయాలు రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదపడుతున్నాయి.

  • జైదీప్ రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?

సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 09:17 AM