ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు: మన్‌ప్రీత్ సింగ్
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:28 PM
ఆగస్టు 15 నుంచే హాకీ ప్రపంచ కప్2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత హాకీ జట్టు సీనియర్ మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చని , అదే దృక్పథంతో బరిలోకి దిగి గెలిచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ ప్రపంచకప్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే తనకు చివరి ప్రపంచకప్ కావచ్చని, అందుకే చివరిదనే దృక్పథంతో బరిలోకి దిగుతానని తెలిపాడు. ప్రపంచకప్ గెలవాలన్న తమ కలను సాకారం చేసుకునేందుకు జట్టు శాయశక్తులా కష్టపడుతుందని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఈసారి టైటిల్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.
‘ఈ ప్రపంచ కప్ నాకెంతో ప్రత్యేకమైనది. ఇది నాకు నాలుగో ఎడిషన్. మేం ఒలింపిక్ పతకాలు గెలిచాం. కానీ, ప్రపంచ కప్‌లో మాత్రం మెడల్ అందుకోలేకపోయాం. ఇప్పుడున్న జట్టులో ప్రతి ఒక్కరి కల కూడా అదే. నావరకైతే ఇదే చివరి ప్రపంచ కప్ కావొచ్చు. అదే ఆలోచనతో బరిలోకి దిగుతా. ఇప్పటి వరకు మేం సాధించలేకపోయిన దానిని అందుకొనేందుకు ప్రయత్నిస్తాం. అదే సమయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మేం పోషించాల్సిన పాత్రపై స్పష్టత ఉంది' అని మన్‌ప్రీత్ తెలిపాడు.
'జట్టులో ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభవం ఉంది. అందరూ అద్భుతమైన ప్రతిభ ఉన్న ప్లేయర్లే. మా సన్నద్ధత కూడా చాలా బాగుంది. ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంటామని బలంగా చెప్పగలను. ప్రతి శిక్షణా సమయంలోనూ మేం వందశాతం కష్టపడ్డాం. జట్టులోని ప్రతి ఒక్కరూ విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే ఉన్నారు. ఫిట్‌నెస్‌పై మా కోచ్ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలానే గోల్స్ కొట్టడం మీదనే కాకుండా.. డిఫెన్స్‌పైనా వర్కౌట్ చేశాం. ప్రత్యర్థి పాకిస్థానా? ఇతర జట్టా? అనేది ముఖ్యం కాదు. మా ప్రణాళిక ప్రకారం ఆడతాం. గెలిచి తీరుతాం’ అని మన్‌ప్రీత్ సింగ్ (Manpreet Singh) వెల్లడించాడు.
ప్రపంచ కప్ పూల్-డి లో వేల్స్, ఇంగ్లండ్, పాకిస్థాన్‌తోపాటు భారత్ ఉంది. తొలి మ్యాచ్ ఆగస్టు 15న సాయంత్రం 4.30 గంటలకు వేల్స్‌తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 17న ఇంగ్లండ్, ఆగస్టు 19న పాకిస్థాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. నెదర్లాండ్స్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్‌ను చివరిసారిగా 1975లో స్వర్ణం వరించింది. ఆ తర్వాత పతకం రాలేదు.
ఇవి కూడా చదవండి:
ఆష్లే గార్డనర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు.. వైస్ కెప్టెన్‌గా కొనసాగింపు!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత