Share News

వారణాసిలో వింత చోరీ.. బైక్ దొంగతనానికి వెళ్లి డ్యాన్స్‌లతో హంగామా..

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:07 PM

దొంగలు సాధారణంగా లక్ష్యంగా చేసుకున్న ఇంటిని నిమిషాల్లోనే దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆలస్యం చేస్తే ఎవరైనా చూస్తారేమోనని, ఇంటి యజమానులు వస్తారేమోనని భయపడుతుంటారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఇటీవల జరిగిన ఓ దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వారణాసిలో వింత చోరీ.. బైక్ దొంగతనానికి వెళ్లి డ్యాన్స్‌లతో హంగామా..
Varanasi Bike Thief

ఉత్తర్‌ప్రదేశ్: దొంగలు సాధారణంగా లక్ష్యంగా చేసుకున్న ఇంటిని నిమిషాల్లోనే దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆలస్యం చేస్తే ఎవరైనా చూస్తారేమోనని, ఇంటి యజమానులు వస్తారేమోనని భయపడుతుంటారు. అందుకే అనుకున్న ప్రదేశంలోకి చొరబడటం, అందినకాడికి దోచుకోవడం వంటివన్నీ అత్యంత వేగంగా ముగించేస్తుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా పారిపోతుంటారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఇటీవల జరిగిన ఓ బైక్ దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డ్యాన్సులతో ఓ దొంగ చేసిన హంగామా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


వారణాసి మండువాడిహ్ ప్రాంతంలోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌లోకి గత సోమవారం అర్ధరాత్రి దొంగ ప్రవేశించాడు. షోరూమ్ అద్దాలు పగలగొట్టి మరీ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, లోపలికి వెళ్లాక అతను ఎలాంటి భయాందోళనలకు గురి కాలేదు. అలాగే ఏమాత్రం కంగారు పడకుండా సొంత ఇంటికి వచ్చినట్లు నాలుగున్నర గంటల పాటు ఎంజాయ్ చేశాడు. తొలుత ఫ్రిజ్ వద్దకు వెళ్లి చల్లటి నీళ్ల బాటిల్ తీశాడు. మంచినీళ్లు తాగుతూ అన్ని బైక్‌లను తీరికగా పరిశీలించాడు. ఆ తర్వాత ఓ కప్పు కాఫీ కూడా తయారు చేసుకుని తాగాడు. మెల్లిగా వాష్‌రూమ్‌కు వెళ్లి స్నానం చేశాడు. తన బట్టలు ఆరేంతవరకు అక్కడే ఉన్న ఓ బ్రాండెడ్ టీ-షర్టు వేసుకుని, టోపీ పెట్టుకుని, బైక్ కవర్‌ను తాత్కాలిక లుంగీగా కట్టుకున్నాడు. అనంతరం తన బట్టలు ఆరిన తర్వాత వాటిని వేసుకున్నాడు.


అప్పుడు షోరూమ్‌లోని మ్యూజిక్ సిస్టమ్‌ను ఆన్ చేసి డ్యాన్స్ కార్యక్రమం మొదలెట్టాడు. కాసేపు నృత్యాలు చేసి ఎంజాయ్ చేశాడు. ఇంత జరుగుతున్నా దీనిని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. ఆ తర్వాత తెల్లవారుజామున సుమారు 4 గంటలకు రూ.4.71 లక్షల విలువైన KTM అడ్వెంచర్ 390-S బైక్‌ను తీసుకుని పరారయ్యాడు. గంట తర్వాత దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే షోరూమ్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

పిల్ల నుంచి తల్లిని వేరు చేసి.. చిరుత స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే..

Updated Date - Aug 14 , 2026 | 06:22 PM