Share News

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:53 PM

పంద్రాగస్టు వేడుకలకు సమాయత్తమవుతోన్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో బాంబు దాడులకు పాల్పడతామని ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్
Delhi High Court Gets Bomb Threat Email Ahead of August 15

ఇంటర్నెట్ డెస్క్,ఆగస్టు 14: దేశ రాజధాని రేపటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ, ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన ఒక బెదిరింపు ఈ-మెయిల్ భద్రతా దళాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలోనే దాడులకు పాల్పడతామని ఆగంతకులు ఆ మెయిల్‌లో హెచ్చరించడం సంచలనంగా మారింది.


ఆగస్టు 15న ఎర్రకోట లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడతామని మెయిల్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు పోలీసు యూనిఫామ్‌లో ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ సందేశమిచ్చే అత్యంత కీలక సమయంలోనే ఈ పేలుళ్లు జరుపుతామని సవాలు విసిరారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండకు బాధ్యులైన రాజకీయ నేతలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిమాండ్ చేశారు.


బెదిరింపు ఈ-మెయిల్ రాగానే ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఆగస్టు 15 వేడుకలు జరిగే ఎర్రకోట పరిసర ప్రాంతాలలో భద్రతను అత్యున్నత స్థాయికి (High Alert) పెంచారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న ఐపీ (IP) అడ్రస్ ఏంటనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీస్ డ్రస్‌లో వస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో.. భద్రతా విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను(ID Cards) పునఃపరిశీలించడం, తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి...

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

Read Latest National News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 05:13 PM