కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:18 PM
తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో, తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట లభించినట్టైంది. ఈ కేసులో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులకు నగదు రూపంలో సాయం చేస్తే అభ్యంతరం చెప్పే వారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. కుటుంబంలోని సంపాదన పరుడైన ఒకే ఒక వ్యక్తి మరణిస్తే కుటుంబసభ్యుల్లో ఎవరోకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం చెబుతారా? ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించేందుకు మీరెవరు? అని ప్రశ్నించింది. గతేడాది టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో తొక్కిసలాటలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీవీకే అధినేత విజయ్ మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ జీవో జారీ చేశారు.
అయితే, ఈ జీవోను జులై 27న హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 14, 15ను ప్రభుత్వ జీవో ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది. ప్రతి ప్రభుత్వ విభాగంలో కారుణ్య నియామకాలు ఆశిస్తున్న వారు ఎందరో ఉంటారని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. వారి అవసరాలను పక్కన పెట్టి కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ముందుగా ఇవ్వడం సబబు కాదని పేర్కొంది. ఆర్టికల్ 162 ప్రకారం ఈ జీఓ జారీ చేశామన్న ప్రభుత్వ వాదనను సైతం కోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అధికారాలు వినియోగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రభుత్వ తప్పిదాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ బాధితులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వని విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ కేసులో కారుణ్య నియామకాలకు అనుమతిస్తే ఒక ప్రమాదకరమైన ఒరవడికి నాంది పలికినట్టు అవుతుందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్ చమోలీలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో ఏడుగురి మృతి
ఓటుకు నోటు కేసు.. తొలి నుంచీ మళ్లీ విచారణ