ఉత్తరాఖండ్ చమోలీలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో ఏడుగురి మృతి
ABN , Publish Date - Aug 14 , 2026 | 08:30 AM
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లోకి సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆ సమయంలో HCC సిబ్బంది నిర్మాణ పనులు చేస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మందిని బయటకు తీసుకొచ్చారు. వారిలో ఏడుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో NDRF, భారత సైన్యం, ITBP బృందాలను కూడా రంగంలోకి దించారు. టన్నెల్‌లో ఇంకా ఇద్దరు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్, NDRF అధికారి అమృత్ లాల్ మీనా సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్‌లో భారీగా నీరు చేరడంతో రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, అన్ని సంబంధిత సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్