Share News

తొలి నుంచీ మళ్లీ విచారణ

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:21 AM

పదకొండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది...

తొలి నుంచీ మళ్లీ విచారణ

  • ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

  • విచారణ జరిపిన ధర్మాసనంలో ఉన్న

  • ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేశారు

  • ఇప్పటి దాకా విన్న వాదనలను పక్కనపెడతాం

  • కొత్తగా విచారణ ప్రారంభిస్తాం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పదకొండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియమావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, కాబట్టి ఆ కేసు చెల్లదని 2021 జూలై 22వ తేదీన రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. ‘అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్లు 7, 11 కింద లంచం తీసుకోవడమే నేరం. లంచం ఇవ్వడానికి కుట్ర చేశారనడం ఆ సెక్షన్ల కింద చెల్లదు. 2018లో లంచం ఇవ్వడం, అందుకు ప్రేరేపించడం వంటి పనులను కూడా నేరంగా పరిగణించేలా ఈ చట్టంలోని సెక్షన్‌ 8ను సవరించారు. అయితే, 2015లో నమోదు చేసిన ఓటుకు నోటు కేసుకు అప్పటి వరకు ఉనికిలో ఉన్న చట్టాలే వర్తిస్తాయి. అంతేకాదు, సెక్షన్‌ 7, 11, 12లు అధికారిక విధి నిర్వహణ (ప్రభుత్వ ఉద్యోగాలు) చేసే వారికి మాత్రమే వర్తిస్తాయి. శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేయడం, ఓటు వేయకపోవడం అనేది ఈ చట్టం పరిధిలోకి రాదు. కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఈ కేసు చెల్లదు’ అని రేవంత్‌ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


మరోవైపు, ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు 2021 ఏప్రిల్‌ 13వ తేదీన సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్ర, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే ఇరుపక్షాల న్యాయవాదులు.. సుదీర్ఘ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నదని, కాబట్టి, కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. సీజేఐ స్పందిస్తూ.. గతంలో ఈ కేసు విచారణను చేపట్టిన ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేశారని, కాబట్టి ఇప్పటి వరకూ జరిగిన విచారణను పక్కన పెడుతున్నట్లు తెలిపారు. కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి చేపడతామన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:21 AM