డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:14 PM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు ఇవాళ (గురువారం) మధ్యాహ్నం లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అంశం చర్చకు వచ్చింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో 97 శాతం జవాబు పత్రాలు దిద్ది ఉండటంపై సీఎం చంద్రబాబు, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించడంపై పలు పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ గ్రూప్-1 వ్యవహారంపై వైసీపీని ఎండగట్టాలని సీఎంను కోరారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. మరికొంతమంది అధికారుల పాత్రా ఉందని, దీనిపైనా దర్యాప్తు జరపాలని చంద్రబాబుకు మంత్రులు విజ్ఞప్తి చేశారు.
2011లో మహారాష్ట్రలోనూ ఇలానే జరిగితే అక్కడ అభ్యర్థులు పోరాటం చేశారని మంత్రులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని మంత్రులకు సూచించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించేందుకు కొంతమంది పోలీస్ శాఖ అధికారులకు ప్రభుత్వం టాస్క్ ఇచ్చిందన్నారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. వారితో వెంటనే మాట్లాడాలని, సమాచారం సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అలాగే, డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని శాసన మండలిలో వైసీపీ లేవనెత్తితే దీటుగా సమాధానం చెబుదామని పేర్కొన్నారు. వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో సహా అగ్రెసివ్‌గా కౌంటర్ ఇవ్వాల్సిందేనని మంత్రులకు స్పష్టం చేశారు. పొలిటికల్ ఎటాక్ స్ట్రాంగ్‌గా ఉండాలన్నారు. కౌన్సిల్‌లో డీఎస్సీపై చర్చకూ సిద్ధమని, ఆరోపణలు చేసే వారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ఇప్పటికే అధికారులు అన్ని విషయాలు చెప్పారని, అయినా కావాలని బురద చల్లితే మాత్రం రాజకీయంగా వదిలిపెట్టవద్దని తేల్చి చెప్పారు.
రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఊపందుకున్నాయని, ఇక వరుసగా ప్రారంభోత్సవాలు చేద్దామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ ఓఆర్‌ఆర్, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో తన అనుభవాలను మంత్రులతో సీఎం చంద్రబాబు షేర్ చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త భద్రతా నిబంధనలు