Share News

మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి

ABN , Publish Date - Aug 13 , 2026 | 03:25 PM

ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు.

మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి
Minister Dola Bala Veeranjaneya Swamy

అమరావతి, ఆగస్టు 13: ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగానే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై వచ్చిన వందల కేసులను చట్టపరంగా అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.


గత ప్రభుత్వ హయాంలో APPSC గ్రూప్ 1పై సిట్‌ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి తెలిపారు. ‘అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలపై సమాధానం ఏది? ప్రైవేట్ రిసార్టులో ఆన్సర్‌షీట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? సీసీ కెమెరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా మూల్యాంకనం ఎలా జరిగింది? APPSC ఆధీనంలో ఉండాల్సిన ఆన్సర్‌షీట్లు ప్రైవేట్ ప్రదేశానికి ఎలా చేరాయి? వ్యక్తిగత Gmail ఖాతాలు, Google Driveల ద్వారా మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణలకు వివరణ ఏది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


సిట్‌ గుర్తించిన మార్కుల వ్యత్యాసాలపై పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని మంత్రి అన్నారు. ఓఎంఆర్‌ షీట్లలో దిద్దుబాట్లు, వైట్‌నర్ వినియోగంపై ఫోరెన్సిక్ నివేదిక ఏమి చెబుతోందని అడిగారు. సంతకాలు సరిపోని దిద్దుబాట్లు, వేర్వేరు ఇంకుల వినియోగంపై విచారణ అవసరమన్నారు. ఒకే ఆన్సర్‌షీట్‌లో వేర్వేరు ఇంకులు ఎందుకని ప్రశ్నిస్తూ.. దీనిపై బాధ్యత ఎవరిదని నిలదీశారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటం చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. రాజకీయ ఆరోపణలు కాదని.. డీఎస్సీపై వాస్తవాలు, ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ‘మెరిట్, పారదర్శకత, న్యాయం.. కూటమి ప్రభుత్వ నియామకాలలో ఇవే ప్రామాణికాలు’ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 04:10 PM