Share News

రాహుల్‌ జీ.. దమ్ముంటే తెలంగాణకు రండి

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:01 AM

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు సవాల్‌ విసిరారు.

రాహుల్‌ జీ.. దమ్ముంటే తెలంగాణకు రండి
Rama chandra rao

  • ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై సమాధానం చెప్పండి

  • 48 గంటల ‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ దీక్షలో కాంగ్రెస్‌

  • అగ్రనేతను నిలదీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు సవాల్‌ విసిరారు. తెలంగాణకొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ పేరుతో బీజేపీ చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను ఆయన ప్రారంభిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేస్తారా? విద్యార్థుల ఆగ్రహాన్ని చవి చూస్తారా? తేల్చుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ీ20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడానికి కాంగ్రెస్‌ సర్కారే బాధ్యత వహించాలన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చే ఏడాదికి అడ్వాన్సుగా రూ.2000 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన సర్కారు.. ఆ మాట కూడా నిలుపుకోలేదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యావత్‌ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డే విద్యాశాఖను నిర్వహిస్తున్నా.. విద్యావ్యవస్థను గాలికొదిలేశారు. ఉస్మానియా యూనివర్శిటీకెళ్లి రూ.1000 కోట్లు ఇస్తామన్న సీఎం.. ఇప్పటికీ రూ.1,000 ఇవ్వలేదు. యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో పలు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక విద్యార్థులను కాంగ్రెస్‌ సర్కారు మోసం చేసింది’ అని రామచందర్‌రావు ఆరోపించారు. బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ వైఖరిని చూస్తుంటే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ పథకాలను రద్దు చేయాలన్న కుట్ర ఉందా? అన్న అనుమానం వస్తోందన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతియుత దీక్ష చేపట్టడానికీ కనీస అనుమతి ఇవ్వని నిరంకుశ పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలు డాక్టర్‌ కే లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్‌, డీకే అరుణ, రఘునందన్‌ రావు, బీజేఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు విద్యార్థులు, విద్యా సంస్థల ప్రతినిధులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.


కేసీఆర్‌ హయాంలో ఏమైందీ బడాయి

‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ అంటూ దీక్ష చేపట్టిన రామ్‌ చందర్‌రావు బడాయి కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఏమైందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. నాడెందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. గత సర్కారే రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టిందని గుర్తు చేసిన ఆది శ్రీనివాస్‌.. నాడు బీజేపీ నేతలు ఎందుకు దీక్షలు చేయలేదన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో పలువురు విద్యార్థులు చనిపోయినప్పుడు బీజేపీ లడాయి ఎటు పోయిందని అడిగారు. న్యాయం కోసం జెన్‌జీ విద్యార్థులు 40రోజులు దీక్ష చేస్తే పట్టించుకున్నారా అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రూప్‌-1పేపర్లు లీక్‌ అయినప్పుడు, ఇంటర్‌, టెన్త్‌ ప్రశ్నాపత్రాలు వాట్సా్‌పలోకి వచ్చినప్పుడు దీక్ష చేయడానికి బీజేపీ నేతలకు పరుపులు దొరకలేదా అని ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు ఐఐఎం తేవడానికి రాంచందర్‌రావు పోరాడితే కాంగ్రెస్‌ మద్దతునిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

అజిత్‌ డోభాల్‌కు త్వరలో స్థానచలనం

జైలుకు సైకో సాదిక్‌.. 14 రోజులు రిమాండ్‌

Updated Date - Aug 25 , 2026 | 06:01 AM