అటవీశాఖలో కలకలం
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:15 AM
మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలోని అటవీశాఖలో ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల డెప్యూటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల డెప్యూటేషన్ల రద్దు
ఆరుగురు ఐఎ్‌ఫఎస్‌ల డెప్యూటేషన్ల రద్దు
సీఎం వచ్చిన గంటల్లోనే నిర్ణయం
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలోని అటవీశాఖలో ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల డెప్యూటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వనమహోత్సవం కార్యక్రమంపై మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఉదయం సమీక్ష నిర్వహించగా.. అదేరోజు సాయంత్రానికి డెప్యూటేషన్ల రద్దు ఆదేశాలు వెలువడ్డాయి. ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఐఎ్‌ఫఎస్ అధికారులు సైదులు, షఫీఉల్లా, రవికిరణ్, శ్రీలక్ష్మీ రెడ్డి, రంజీత్ నాయక్, సోనిబాలాదేవి తక్షణమే రిలీవ్ అయ్యి, తమ మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అటవీ శాఖలో అధికారుల కొరత తీవ్రంగా ఉందని, డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే వెనక్కి రప్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వినయ్‌కుమార్ కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం.
వనమహోత్సవం లెక్కల్లో పొంతనేదీ?
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వనమహోత్సవం’ కింద నాటిన మొక్కల గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖ స్ర్పెడ్‌షీట్ డేటాకు.. ప్రభుత్వ డిజిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీజీ ఎఫ్‌ఎంఐఎస్) రికార్డులకు మధ్య ఏకంగా 60.50 లక్షల మొక్కల వ్యత్యాసం ఉండడం ఉన్నతాధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అయితే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్ర్పెడ్‌షీట్ ప్రకారం.. ఇప్పటి వరకు 5.32 కోట్ల మొక్కలు (86శాతం) నాటినట్లు తెలుస్తోంది. టీజీ ఎఫ్‌ఎంఐఎస్ ప్రకారం చూస్తే.. కేవలం 4.71 కోట్ల మొక్కలు (లక్ష్యంలో 76 శాతమే) నాటినట్టు స్పష్టమవుతోంది. అంటే 10 శాతం తేడా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నాటిన ప్రతి మొక్కకు జియో రిఫరెన్స్ చేయాల్సి ఉండగా, కేవలం 4.22 కోట్ల మొక్కలకే ఇది పూర్తయింది. మరోవైపు హార్టికల్చర్ ప్లాంటేషన్లలోనూ పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. 19 వేల ఎకరాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 3,447 ఎకరాల్లోనే (లక్ష్యంలో 18.1 శాతమే) నాటడం పూర్తయింది.
ఈ వార్తలను కూడా చదవండి
అజిత్ డోభాల్‌కు త్వరలో స్థానచలనం
జైలుకు సైకో సాదిక్.. 14 రోజులు రిమాండ్