అజిత్ డోభాల్‌కు త్వరలో స్థానచలనం?
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:27 AM
కేంద్ర ప్రభుత్వ అధికార వ్యవస్థలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంట్లో భాగంగా.. 81 ఏళ్ల వయసున్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, 78 ఏళ్ల వయసున్న ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాలను ఆయా కీలక పదవుల నుంచి తప్పించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
భద్రతా సలహాదారుగా తప్పించి గవర్నర్‌గా నియామకం!
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ అధికార వ్యవస్థలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంట్లో భాగంగా.. 81 ఏళ్ల వయసున్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, 78 ఏళ్ల వయసున్న ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాలను ఆయా కీలక పదవుల నుంచి తప్పించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. వీరిని గవర్నర్ తదితర పదవుల్లో నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోనూ భారీ మార్పులు చేర్పులు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబరు 7, 8 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన ఆంతరంగిక వర్గాలతో చర్చించినట్లు తెలిసింది. ఈ ప్రత్యేక సమావేశాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగానే జరుగుతాయని, అందుకే గత వర్షాకాల సమావేశాలను రాష్ట్రపతి ప్రోరోగ్ చేయలేదని అధికార వర్గాలు గుర్తు చేశాయి. డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్)లతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఎన్డీఏలో చేరేందుకు, కేంద్రంలో కీలకమైన క్యాబినెట్ పదవులను స్వీకరించేందుకు ఈ పార్టీలు సిద్ధమైనట్లు సమాచారం. సెప్టెంబరు మొదటి వారంలోపు కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, క్యాబినెట్‌లో కీలక మార్పులు జరుగుతాయని, గవర్నర్ల నియామకం ఉంటుందని ఊహాగానాలున్నాయి.