Share News

రాష్ట్రానికి అవమానం

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:34 AM

‘‘నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే ‘వైబ్రెంట్‌ గుజరాత్‌’ పేరిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లారు. అమెరికా పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా, తెలంగాణకు వెళ్తాయన్న ఉద్దేశంతో నా పర్యటనకు అనుమతి నిరాకరించారు.

రాష్ట్రానికి అవమానం
CM Revanth Reddy

  • తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి కుట్ర

  • గుజరాత్‌ సీఎంకు అనుమతి ఇచ్చి.. నన్ను అడ్డుకోవడమేంటి?

  • లండన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికాకు నిరాకరణా?

  • విదేశీ పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా తెలంగాణకు

  • వెళతాయనే నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారు

  • ఇది రాజకీయ వివక్ష, చిన్నచూపు, రాష్ట్రంపై చులకనభావం

  • ఇంకా గుజరాత్‌కు సీఎం, సలహాదారుగానే మోదీ వ్యవహారశైలి

  • సత్సంబంధాలకు మేం ప్రయత్నిస్తున్నా కేంద్రం సహకరించట్లేదు

  • ప్రధాని మోదీ పాకిస్థాన్‌ వెళ్లవచ్చు.. మేం అమెరికా వెళ్లకూడదా!?

  • విదేశాల్లో ఎవరినైనా కలిసేది షెడ్యూలు ప్రకారమే

  • అక్కడ అడుగడుగునా వెంట విదేశీ రాయబారులుంటారు

  • నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు.. ఒప్పందాలతో అధికారులు తిరిగొస్తారు

  • కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం రేవంత్‌

  • సురేఖ అంశంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య

హైదరాబాద్‌: ‘‘నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే ‘వైబ్రెంట్‌ గుజరాత్‌’ పేరిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లారు. అమెరికా పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా, తెలంగాణకు వెళ్తాయన్న ఉద్దేశంతో నా పర్యటనకు అనుమతి నిరాకరించారు. గుజరాత్‌ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశం తప్ప రాజకీయ కారణాలేవీ లేవు. ఇది పూర్తిగా రాజకీయ వివక్ష. తెలంగాణ అభివృద్ధిని అడ్డు కోవడమే. కేంద్రం వైఖరి ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌ సీఎంకు అనుమతి ఇచ్చి.. తన పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించ డానికే కేంద్రం కుట్ర చేసిందంటూ ధ్వజమెత్తారు. లండన్‌ పర్యటనను ముగించుకుని సోమవారం హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత్‌ భారత్‌లో భాగంగా తెలంగాణ రైజింగ్‌- 2047 లక్ష్యంతో విదేశీ పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లాలన్న తన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఖండిస్తున్నారని, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని తెలిపారు. ‘‘తెలంగాణను కేంద్ర ప్రభుత్వం చులకనగా చూస్తోంది. చిన్నచూపుతో వివక్షను ప్రదర్శిస్తోంది. నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడమంటే.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. పైగా, అనుమతి నిరాకరణకు రాజకీయ కారణాలను ఆపాదించడం సమంజసం కాదు. లండన్‌, అమెరికా పర్యటనలకు సంబంధించి విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసిన సమయంలోనే అన్ని వివరాలను, సమావేశాల వివరాలను వెల్లడించాను. అయినా, లండన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికాకు అనుమతి నిరాకరించడం ఏమిటి!?’’ అని ప్రశ్నించారు.


మోదీ ఇంకా గుజరాత్‌కు సీఎం మాదిరిగా, సలహాదారు మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రావేమోనన్నదే తమ ఆక్రోశమని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలతో సాగాలని తాము ప్రయత్నిస్తున్నా.. కేంద్రం సహకరించడం లేదని తప్పుబట్టారు. మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం సన్నగిల్లి, నిరంకుశత్వం పెరిగిందన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అడ్డుకుంటోందని, ముందుగానే అన్ని వివరాలు నివేదించినా.. లండన్‌కు అనుమతినిచ్చి.. అమెరికా పర్యటనకు నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. పైగా, తాను అమెరికాలోని హార్వార్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని, ఒప్పందాల విషయంలో తనకు అవగా హన ఉందని, ఆహ్వానం కూడా ఉందని వివరించారు.


వెంటే.. విదేశీ రాయబారులు ఉంటారు

తన అమెరికా పర్యటన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాలను దెబ్బతీస్తుందని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా పర్యటనలో మీరు పాకిస్థాన్‌ మద్దతుదారుడు, న్యూయార్క్‌ మేయర్‌ మామ్దానీని కలిసేందుకు ప్రయత్నించారని, అందుకే అనుమతిని నిరాకరించినట్లు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని విలేకరులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. విదేశీ పర్యటనల పేరుతో మోదీ పాకిస్థాన్‌ వెళ్లవచ్చని, అక్కడ బిర్యానీ తిని రావచ్చని, కానీ, రాష్ట్రాల సీఎంలు అమెరికా మాత్రం వెళ్లకూడదా అని నిలదీశారు. ‘‘నా విదేశీ పర్యటన విషయంలో ఎలాంటి గోప్యత లేదు. దరఖాస్తు చేసినప్పుడే అన్ని వివరాలూ స్పష్టంగా పేర్కొన్నాం. విద్య, క్రీడలు, రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని పేర్కొన్నాం. యూకే, యూఎస్‌ పర్యటనలకు ఒకే తరహా వివరాలు ఇచ్చాం. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ జరుపుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని భావించాం. విదేశీ కంపెనీలకు మన సమ్మిట్‌ గురించి వివరిస్తే.. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా లేదా అనే అంశంపై ఆయా కంపెనీలు 4 నెలల ముందే బోర్డు మీటింగ్స్‌లో చర్చించుకుని, ఆమోదించుకునే అవకాశం ఉంటుంది. ఆ కారణంగానే విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించాం. ఇది చాటుమాటు వ్యవహారం కాదు. నా పర్యటన మొత్తం షెడ్యూల్‌ను విదేశాంగ శాఖకు ఇచ్చాం. ఒక సీఎం విదేశాలకు వెళితే, విదేశీ రాయబారులు వెంటే ఉంటారు. ప్రతి కార్యక్రమాన్నీ వారు పర్యవేక్షిస్తారు. ప్రతి క్షణం షెడ్యూలు ప్రకారమే ఉంటుంది. ప్రతి సమావేశంలో భారత రాయబారి కూడా ఉంటారు. ఆ వివరాలన్నింటినీ కేంద్రానికి నివేదిక రూపంలో సమర్పిస్తారు. గతంలో రాయబారిగా పని చేసిన జైశంకర్‌ ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు. అయినా, మామ్దానీ న్యూయార్క్‌ మేయర్‌. ఆయనను, ఇతరులను ఎవరినైనా కలవాలంటే అపాయుంట్‌మెంట్‌ ఉండాలి’’ అని తెలిపారు. అనుమతి నిరాకరణపై బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై, సీఎం అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, వారి ప్రచారాలపై స్పందించబోనని, వారిది ఆ స్థాయి కాదంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఎలాగైతే వివరాలు ఇచ్చామో అదే విధంగా ఇప్పుడూ విదేశాంగ శాఖకు సమర్పించామని తెలిపారు. అనుమతి నిరాకరణకు రాజకీయ నిర్ణయాలే కారణమని కేంద్రం చెబుతోందని, అవి ఏమిటో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రికి తెలియకుండా ఒక రాష్ట్ర సీఎం విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరిస్తుందా అని ప్రశ్నించారు.


నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు..

దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు, పేద, మధ్య తరగతి వారికి విదేశీ విద్యను ఇక్కడే అందించాలన్న లక్ష్యంతో లండన్‌, అమెరికా పర్యటనను ఖరారు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. గాంధీ, అంబేడ్కర్‌ చదివిన వర్సిటీలను ఇక్కడకు తీసుకురావడం, అక్కడి వర్సిటీలను ఇక్కడకు తీసుకురావడం ద్వారా యువతకు అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమని చెప్పారు. ‘‘నా పర్యటన పట్ల కేంద్రం వ్యవహరించిన వైఖరి ఆషామాషీ విషయం కాదు. నా పర్యటనను అడ్డుకోవచ్చేమో! కానీ, నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు. అధికారులు అమెరికా వెళ్లారు. అక్కడి వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని వస్తారు’’ అని స్పష్టం చేశారు. కేంద్రం వైఖరిపై విదేశాల్లో ఉన్నప్పుడే మాట్లాడొచ్చని, కానీ, విదేశాల్లో ఉండి దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాడంటూ మళ్లీ బీజేపీ వాళ్లు విమర్శిస్తారనే అక్కడ ప్రస్తావించలేదని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, పలువురు విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. అందకుముందు విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, సీతక్క తదితరులు సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది

మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపై ఏ నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడగ్గా.. పార్టీ విషయాలపై పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌ చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, ఊహజనితమైన అంశా లను ప్రస్తావించొద్దని అన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 04:38 AM