ఉక్కులో జిమ్మిక్కు
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:41 AM
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఒక్కొక్కరికి ఒక్కో రకం నిబంధన అమలు చేస్తున్నారని ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని కొత్త నిబంధనలు తీసుకువచ్చారని ఆరోపిస్తున్నాయి. సంస్థ ఆర్థిక స్థితి బాగా లేదని పేర్కొంటూ ఉద్యోగులకు ఏడాదిన్నర కాలంగా పూర్తి జీతాలు ఇవ్వడం లేదు.
కార్మికులు, ఉద్యోగులకు
ఉత్పత్తి ఆధారిత జీతాలు
అధికారులకు మాత్రం పూర్తిస్థాయిలో జీతాలు
కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు..
అయినా స్పందన శూన్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఒక్కొక్కరికి ఒక్కో రకం నిబంధన అమలు చేస్తున్నారని ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని కొత్త నిబంధనలు తీసుకువచ్చారని ఆరోపిస్తున్నాయి. సంస్థ ఆర్థిక స్థితి బాగా లేదని పేర్కొంటూ ఉద్యోగులకు ఏడాదిన్నర కాలంగా పూర్తి జీతాలు ఇవ్వడం లేదు. దశల వారీగా పర్సంటేజీల ప్రకారం చెల్లిస్తున్నారు. ఈ విధంగా స్టీల్‌ప్లాంటు యాజమాన్యం సగటున ఒక్కో ఉద్యోగికి 390 శాతం జీతం బకాయి పడింది. అంటే సుమారు నాలుగు నెలల జీతం చెల్లించాల్సి ఉంది. ఇదిలావుండగానే గత ఏడాది నవంబరు నుంచి ఉత్పత్తి ఆధారిత జీతాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం నడిపే ఏ స్టీల్‌ప్లాంటులోను ఈ విధానం లేదు. ప్రతి విభాగానికి ప్రతి నెలా లక్ష్యం ఇచ్చి, అందులో ఎంత ఉత్పత్తి చేస్తే అంతే జీతం ఇవ్వడం ప్రారంభించారు. ప్లాంటును 100 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడిపే ఆర్థిక వనరులు, ముడిసరకులు యాజమాన్యం వద్ద లేకపోయినా ఈ నిబంధన అమలు చేయడం గమనార్హం. దీంతో ఉద్యోగులు 80 నుంచి 95 శాతం జీతాలు మాత్రమే అందుకుంటున్నారు. ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ ఈ రకంగా జీతాలు ఇస్తూ, ఉన్నతాధికారులు అంటే డైరెక్టర్లు, ఆపైన ఉండేవారు మాత్రం పూర్తి జీతాలు తీసుకుంటున్నారు. ప్లాంటు ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేకపోయినప్పుడు వారు కూడా అందులో భాగస్వాములే అయినప్పుడు వారు ఎలా పూర్తి జీతాలు తీసుకుంటారని ప్రశ్నిస్తూ ఓ కార్మిక నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అది ఇప్పుడు ప్లాంటు వర్గాల్లో కలకలం రేపుతోంది.
జీతాలు ఇవ్వకుండా ఆదాయ పన్ను చెల్లింపు
ఉద్యోగులకు వంద శాతం జీతాలు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి, ఆ మొత్తాలపై వారి తరపున యాజమాన్యం ఆదాయ పన్ను చెల్లించుకుంటూ పోతోంది. జీతాల్లో బకాయిలు ఏమైనా ఉంటే వాటిని ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి సెటిల్‌మెంట్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ నిధుల లేమి పేరుతో బకాయిల చెల్లింపును పక్కన పెడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు 230 శాతం జీతం బకాయిలు ఉండగా, దానిపై కూడా ఆదాయ పన్ను కట్టేశారని, దీనివల్ల సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు నష్టపోయామని, అధికారుల సంఘం నాయకుడు ఒకరు తెలిపారు. ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ పేరు చెప్పి, విశాఖపట్నంలో యాజమాన్యం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నదని, వీటిపై ఫిర్యాదులు, కోర్టు కేసులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించకపోవడంపై వారంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం విజిలెన్స్ విచారణ అయినా చేపట్టి, ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.