Share News

జైలుకు సైకో సాదిక్‌.. 14 రోజులు రిమాండ్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:27 AM

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ ఖాన్‌కు కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు..

జైలుకు సైకో సాదిక్‌.. 14 రోజులు రిమాండ్‌

  • జగదీశ్వరరెడ్డిని చంపేందుకు తానే సైనైడ్‌ను

  • తెప్పించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకోలు!

  • మత మార్పిడికి సాదిక్‌ ఒత్తిడి: ఎస్పీ బిందుమాధవ్‌

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ ఖాన్‌కు కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో సర్పవరం పోలీసులు పోలీసులు అతన్ని కాకినాడ సబ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కాకినాడ పోలీసులు మంగళవారం పిటిషన్‌ వేయనున్నారు. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్‌ కార్తికేయరెడ్డిలు ఈ నెల 16 అర్ధరాత్రి రాజమహేంద్రవరం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రియాన్స్‌ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాదిక్‌ వెంటనే పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం దాదాపు వారం రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి కాకినాడకు రైల్లో తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాదిక్‌ను కాకినాడ రూరల్‌ సీఐ కార్యాలయం సమీపంలో ఉన్న విచారణ గదిలో పోలీసులు ప్రశ్నించారు. నూకరాజు కుటుంబంతో ఉన్న సంబంధాలు, సౌజన్యతో ఉన్న సన్నిహిత సంబంధం తదితర విషయాలపై పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినా.. దేనికీ సాదిక్‌ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ సమక్షంలో సాయంత్రం 4 గంటలకు సాదిక్‌ను మీడియా ముందుకు ప్రవేశపెట్టిన తర్వాత అత్యంత భద్రత నడుమ కోర్టుకు తరలించారు. జడ్జి ఉషా లక్ష్మీకుమారి నిందితుడికి రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో సాదిక్‌ కుటుంబసభ్యులకు మాత్రం అతడితో మాట్లాడే అవకాశం కల్పించారు. సాదిక్‌ తన సోదరుడితో స్వేచ్ఛగా మాట్లాడగా.. అతడిలో ఎలాంటి భయం, బెరుకు కనిపించలేదు.

Updated Date - Aug 25 , 2026 | 04:28 AM