Share News

సర్వీసు టీచర్లకు స్పెషల్‌ టెట్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:38 AM

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న సర్వీసు టీచర్లకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(స్పెషల్‌ టెట్‌) నిర్వహించనున్నారు.

సర్వీసు టీచర్లకు స్పెషల్‌ టెట్‌

  • విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల.. సెప్టెంబరు 24 వరకు దరఖాస్తులు

  • అక్టోబరు 11 నుంచి పరీక్షలు.. పరీక్ష విధానం మార్చాలి: సంఘాలు

అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న సర్వీసు టీచర్లకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(స్పెషల్‌ టెట్‌) నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి టీచర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 9 వరకు ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించవచ్చు. అక్టోబరు 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అక్టోబరు 11 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు 10న తుది ‘కీ’ విడుదల చేస్తారు. అదే నెల 15న తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ టెట్‌ కేవలం టీచర్లకు మాత్రమే వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సర్వీసులో ఉన్న టీచర్లంతా తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పెషల్‌ టెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, సంక్షేమ సొసైటీలు, మోడల్‌ స్కూల్స్‌, ఎయిడెడ్‌, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, మినిమం టైమ్‌ స్కేలుపై పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్పెషల్‌ టెట్‌ రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. కాగా, ఈ స్పెషల్‌ టెట్‌ కేవలం సర్వీసులో కొనసాగేందుకు లేదా పదోన్నతి పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కొత్తగా ఉద్యోగాలు పొందేందుకు ఈ పరీక్ష ఉపయోగపడదు. ఉద్యోగాల కోసం రెగ్యులర్‌ టెట్‌ రాసి అర్హత సాధించాలి. ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్ఎల్‌ హెచ్‌ఎంలు పేపర్‌-1 పరీక్ష రాసేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీలు, భాషా పండితులు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు పేపర్‌-2 రాసేందుకు అర్హులు.


మోడల్‌ ప్రైమరీ పాఠశాలల హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు వారివారి సబ్జెక్టులో పేపర్‌-2 పరీక్ష రాయాలి. అన్ని ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు ఉండవు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. టెట్‌ ఉత్తీర్ణత మార్కుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఓసీ/ఈడబ్ల్యూఎస్‌ టీచర్లకు 60శాతం(90 మార్కులు), బీసీ టీచర్లకు 50శాతం(75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 40శాతం(60 మార్కులు) ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన టీచర్లకు ఇచ్చే సర్టిఫికెట్‌కు జీవితకాల చెల్లుబాటు ఉంటుంది. ఒక్కో పేపరు రాసేందుకు అభ్యర్థులు పేపరుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి. డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగినవారు పేపర్‌-1, 2 రెండూ రాయొచ్చు. రాష్ట్రం, రాష్ట్ర సరిహద్దు సమీప పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


72,338 మంది అంచనా

రాష్ట్రంలో ప్రస్తుతం 1.8 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 2011కు ముందు నియమితులైన టీచర్లకు టెట్‌ లేదు. అయితే, వారు కూడా ‘టెట్‌’ అర్హత సాధించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌ అర్హత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో సుప్రీంకోర్టు విధించిన మూడేళ్ల గడువులోగా అర్హత సాధించకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెగ్యులర్‌ టెట్‌తో పాటు టీచర్లకు స్పెషల్‌ టెట్‌ నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన రెగ్యులర్‌ టెట్‌లో కొందరు అర్హత సాధించగా ఇంకా 72,338 మంది టెట్‌ లేని టీచర్లు రాష్ట్రంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మూడేళ్ల గడువులోగా వారు తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, మాన్యువల్‌ విధానంలో టెట్‌ పరీక్ష నిర్వహించాలని, మార్కులు తగ్గించాలని టీచర్లు కోరారు. అయితే, పాఠశాల విద్యాశాఖ పరీక్షలో ఎలాంటి మార్పులు చేయలేదు.

మినహాయింపులు ఇవ్వాలి

స్పెషల్‌ టెట్‌లో మూడు మినహాయింపులు ఇవ్వాలని ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, ఎస్‌. చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ ఒకే అర్హత మార్కులు పెట్టాలని, పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, ఏ సబ్జెక్టు టీచర్‌కు ఆ సబ్జెక్టు సిలబస్‌ ప్రశ్నలతో మాత్రమే టెట్‌ నిర్వహించాలని కోరారు. ఉత్తీర్ణత మార్కులు అందరికీ 40శాతంగా ఉంచాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్‌. సాయి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు.

Updated Date - Aug 25 , 2026 | 04:43 AM