Share News

తపాలా శాఖలో డిజిటల్‌ విప్లవం

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:53 AM

తరతరాలుగా కోట్లమంది నమ్మకాన్ని గెలుచుకున్న ‘ఇండియా పోస్ట్‌’ రూపురేఖలు వేగంగా మారుతున్నాయని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

తపాలా శాఖలో డిజిటల్‌ విప్లవం

  • సేవలు ప్రతి తరానికి చేరువయ్యేలా సమగ్ర మార్పులు

  • వినియోగదారుల కోసం డాక్‌ సేవ యాప్‌ ప్రారంభం

  • సిబ్బంది కోసం డాక్‌ మిత్ర యాప్‌ కూడా..

  • 5,700 కోట్లతో ఐటీ-2.0 ప్రాజెక్టు: కేంద్రమంత్రి పెమ్మసాని

న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): తరతరాలుగా కోట్లమంది నమ్మకాన్ని గెలుచుకున్న ‘ఇండియా పోస్ట్‌’ రూపురేఖలు వేగంగా మారుతున్నాయని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రజలకు పోస్టల్‌ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని రంగ్‌భవన్‌లో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి డాక్‌ సేవ, డాక్‌ మిత్ర మొబైల్‌ యాప్‌లను పెమ్మసాని ప్రారంభించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన నెక్ట్స్‌ జెన్‌ పోస్టాఫీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందడంతోపాటు వ్యాపారాలకు నమ్మకమైన ల్యాజిస్టిక్స్‌ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా రెండేళ్లుగా తపాల శాఖలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఐటీ 2.0 ప్రాజెక్టు కోసం రూ.5,700 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టి.. రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌, లాజిస్టిక్స్‌ పర్యవేక్షణ వంటి అత్యాధునిక వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినట్లు పెమ్మసాని చెప్పారు. ప్రజలకు డిజిటల్‌ సేవలు సులభతరం చేసేందుకు డాక్‌ సేవ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోస్టాఫీసు ఉద్యోగుల కోసం డాక్‌ మిత్ర యాప్‌ను తీసుకొచ్చామన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 05:56 AM