తొలి ప్రధానిగా నెహ్రూ నాటిన విత్తనాలే నేడు మహావృక్షాలయ్యాయి
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:56 AM
స్వాతంత్య్రం తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు.
దేశప్రజలకు నీడ, పండ్లను ఇస్తున్నాయి..
దేశ నిర్మాణానికి పునాదులు వేశారు
సాగు, పరిశ్రమలు, విద్యారంగాల.. అభివృద్ధికి నెహ్రూ విశేష కృషి చేశారు
సోనియాకు 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవి స్వీకరించలేదు
సంగారెడ్డిలో నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. శనివారం నెహ్రూ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మల ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సరిపడా ఆహారం, పరిశ్రమలు, మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో దూరదృష్టితో ఆనాడు నెహ్రూ చేపట్టిన సంస్కరణలే నేడు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు.
నాగార్జునసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, ఐఐటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు నెలకొల్పారని గుర్తుచేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేశారని, శాసన, న్యాయ వ్యవస్థల పటిష్టతకు కృషి సల్పారని తెలిపారు. నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేశారని, దేశం కోసం బలిదానాలు, త్యాగాలకు పాల్పడ్డ కుటుంబం వారిది అని కొనియాడారు. సోనియగాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ ఆ పదవి స్వీకరించకుండా.. పదవుల కన్నా దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ నాటిన అభివృద్ధి మొక్కలు నేడు మహావృక్షాలుగా మారి దేశ ప్రజలకు నీడను, పండ్లను ఇస్తున్నాయని అభివర్ణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News