అడ్వకేట్ స్వప్న హత్య కేసులో కీలక పురోగతి.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:12 PM
చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది.
చేవెళ్ల, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును(Advocate Swapna Case) పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నయ్యే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది. ఆస్తి కోసం తోడబుట్టిన బంధాన్ని మర్చిపోయి చేసిన ఈ హత్య మొయినాబాద్ ప్రాంతంలో సంచలనంగా మారింది. పోలీసులు.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీరికి కఠిన శిక్ష పడేలా చూస్తామని డీసీపీ యోగేశ్ తెలిపారు. ఇది పూర్తిగా ప్లాన్ చేసి చేసిన హత్య అని.. భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, అన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై ఉన్న వివాదమే ఈ హత్యకు కారణమని తేలిందని అన్నారు. భూమి సర్వే విషయంలో స్వప్న, రాజు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని చేవెళ్ల డీసీపీ తెలిపారు. ఆ భూమిని తన పేరిట మార్చుకోవాలని లేదా సొంతం చేసుకోవాలని స్వప్న సోదరుడు రాజు పథకం వేశాడు. ఈ క్రమంలో చెల్లెలు అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే హత్యకు పాల్పడ్డాడు.
నిందితుల వివరాలు..
ఈ కేసులో పోలీసులు నలుగురిని (A1 - A4) అరెస్ట్ చేశారు. A1: గోటికె రాజు (స్వప్న సొంత సోదరుడు - ప్రధాన నిందితుడు) A2: ఎర్రోళ్ల సందీప్, A3: వడ్డె వీరేశం, A4: కావలి శివలింగం ఉన్నారు.
పక్కా స్కెచ్‌తో దారుణం..
హత్య జరిగిన తీరు అత్యంత భయంకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. భూమి సర్వే కోసం స్వప్న పొలం వద్దకు వెళ్లిన సమయాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నారు. మొదట నిందితులు.. ఇన్నోవా కారుతో స్వప్నను బలంగా ఢీకొట్టారు. ఆమె కింద పడిపోగానే రాళ్లు, కర్రలతో దాడి చేశారు. చివరగా అత్యంత క్రూరంగా కొడవలితో గొంతుకోసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. హత్య అనంతరం నిందితులు ఇన్నోవా కారు, స్కూటీపై అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఇన్నోవా వాహనం, స్కూటీ, నిందితుల మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
న్యాయవృత్తిలో ఉన్న స్వప్న..
హత్యకు గురైన గోటికె స్వప్న చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ధైర్యవంతమైన మహిళగా స్వప్నకు పేరుండేదని సహచరులు చెబుతున్నారు. సొంత అన్న చేతిలోనే ఆమె హత్యకు గురవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని తన సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశం
Read Latest Telangana News And AP News And Telugu News