Share News

కక్షసాధింపు ఆలోచనే లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:13 PM

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఈ విచారణ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..

కక్షసాధింపు ఆలోచనే లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Telangana Phone Tapping Case

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌పై కక్షపూరిత చర్యగా బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘ప్రభుత్వానికి ఎవరి మీద కక్షసాధింపు ఆలోచన లేదు, ఎవరైనా కక్షసాధింపు అనుకుంటే వారి అభిప్రాయం మాత్రమే. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. విచారణ ప్రక్రియపై నేను కామెంట్ చేయను.. కామెంట్ చేస్తే ఎంక్వైరీపై ప్రభావం పడుతుంది. విచారణ పూర్తయ్యాక.. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారో తెలుస్తుంది. ఉగ్రవాద నిర్మూలన కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ కొందరు వ్యక్తులపై చేశారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతోంది’ అని అన్నారు.


బడ్జెట్‌లో అన్యాయం జరిగింది..

కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రసిద్ధి. కానీ, బయోఫార్మాలో తెలంగాణకు అవకాశం ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్‌లో ఫార్మా హబ్, క్రీడా శాఖల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు భారీ కేటాయింపులు ఉంటాయని ఎంతో ఆశించాం, సీఎం, నేను ప్రధానికి అనేక విజ్ఞప్తులు ఇచ్చాం. అవన్నీ పట్టించుకోలేదు, తెలంగాణ ఏం తప్పు చేసిందని బడ్జెట్ లో అన్యాయం చేశారు? టూరిజం ప్యాకెజీలో తెలంగాణను పెట్టకపోవడం బాధాకరం. సెమీ కండక్టర్ రంగంలో తెలంగాణకు మొండిచేయి చూపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమాన్ని కేంద్రం విస్మరించింది. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు. FRBM పరిధిని 4 శాతానికి పెంచాలని అడిగాం. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పార్టీలకు అతీతంగా ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించాలని కోరుతున్నా’ అని భట్టి విక్రమార్క అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 08:32 PM