Share News

కేరళ ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యం.. బడ్జెట్‌పై శశిథరూర్

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:32 PM

ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతృప్తి కలిగించలేదని శశిథరూర్ అన్నారు. బడ్జెట్‌లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.

కేరళ ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యం.. బడ్జెట్‌పై శశిథరూర్
Shashi Tharoor

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ 2026-2027పై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పెదవి విరిచారు. ఒక మలయాళీగా తనకు బడ్జెట్ సంతృప్తి కలిగించలేదని అన్నారు. బడ్జెట్‌లో కేరళ ప్రస్తావనే లేకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఆయుర్వేదం, మత్స్యకారులు, కొబ్బరితోటలు, షిప్ మరమ్మతులకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనలు లేవన్నారు.


కేరళకు సుదీర్ఘమైన ఆయుర్వేద చరిత్ర ఉందని, ఆయుర్వేద ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ కోసం తామంతా ఎదురుచూస్తున్నామని, కానీ ఆ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకుండా పోయిందని శశిథరూర్ విమర్శించారు. కనీసం మత్స్యకారులు, కొబ్బరితోటల సంబంధించి ఏదైనా ప్రకటన ఉండొచ్చని ఆశించామని, అది కూడా లేదని అన్నారు. నౌకాశ్రయాల మరమ్మతుల ప్రస్తావన వచ్చినప్పుడు వారణాసి, పాట్నా పేర్లు చెప్పారే కానీ కేరళ ఊసే లేకపోవడం ఆశ్చర్య కలిగించిందని పేర్కొన్నారు.


ఉద్యోగాల కల్పన అనేది మరోసారి జవాబులేని ప్రశ్నగా మిగిలిందని శశిథరూర్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో దీనిపై మాట్లాడింది కూడా ఏమీ లేదన్నారు. గత కొన్నేళ్లుగా చేస్తున్న బడ్జెట్ ప్రసంగాలలో ఇది చాలా చిన్నదని చెప్పారు. మధ్యతరగతి, దిగువ తరగతి వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం కానీ, కనీసం ఏం చేయబోతున్నారనే వివరాలు కూడా బడ్జెట్‌లో చేటుచేసుకోలేదని అన్నారు.


ఇవి కూడా చదవండి

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ

Updated Date - Feb 01 , 2026 | 05:35 PM