అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:34 PM
బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్-2026పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించిందని, బెంగాల్‌కు రావాల్సిన నిధుల వాటాను నిలిపివేసిందని అన్నారు. ప్రజలకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చడానికి బదులుగా కొత్త ఆర్థిక కారిడార్ల పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతోందని, మాటల గారడీకి పాల్పడిందని తప్పుపట్టారు.
బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టామని, మూడు కారిడార్లంటూ కేంద్రం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. పురులియాలో జంగల్ మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును మమతా బెనర్జీ ప్రస్తావిస్తూ, కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండానే ఈ ఎకనామిక్ కారిడార్‌ను రూ.72,000 కోట్ల పెట్టుబడితో ప్లాన్ చేశామని తెలిపారు.
రూ.2 లక్షల కోట్లకు పైగా బకాయిలు
బెంగాల్ నుంచి పెద్దమొత్తంలో పన్నులను కేంద్రం వసూలూ చేస్తూ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయడంలో మాత్రం విఫలమైందని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. 'బెంగాల్‌కు వాళ్లు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. జీఎస్‌టీ అంటూ వాళ్లు మా సొమ్ములు తీసుకుంటూ మాకు డబ్బులు ఇస్తున్నట్టుగా చాలా పెద్ద మాటలు చెబుతున్నారు. అది ముమ్మాటికీ మా సొమ్మే' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పశ్చిమ బెంగాల్‌కు రూ.2 లక్షల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నాయని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందని చెప్పారు. దేశ ఆర్థిక, రాజ్యాంగబద్ధ, సమాఖ్య వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేస్తోందని, ఈ రకంగా ప్రభుత్వాన్ని నడిపే నైతిక అధికారాన్ని కేంద్రం కోల్పోయిందని మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ
కేంద్ర బడ్జెట్ 2026తో ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి ?