Share News

140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌పై ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:41 PM

ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందన్నారు.

140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం.. బడ్జెట్‌పై ప్రధాని మోదీ
PM Modi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌(Budget 2026)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రశంసలు కురిపించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్ అని అభివర్ణించారు. మహిళల్లో పెరుగుతున్న సాధికారత, దేశంలో అవకాశాల విస్తరణను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డును నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారని అన్నారు. ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రశంసించారు మోదీ. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందని అన్నారు.


కొత్త రికార్డు.. కొత్త ధీమా

'ఇవాల్టి బడ్జెట్ చరిత్రాత్మకం. దేశంలోని మహిళా సాధికారతను ప్రతిబింబిస్తోంది. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు' అని మోదీ అన్నారు. సుదీర్ఘ లక్ష్యాల ఆవశ్యతను వివరిస్తూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదని, సాధ్యమైనంత త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఉందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడేందుకు 2026 బడ్జెట్ పటిష్ఠమైన పునాది వేసిందని అన్నారు. బడ్జెట్ కొత్త శక్తిని, ఆర్థిక సంస్కరణల వేగానికి ఊతమిచ్చేలా ఉందని చెప్పారు.


మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వేగానికి ఊతమిచ్చే రోడ్‌మ్యాప్ ఈ బడ్జెట్ అని, కొత్త, రైజింగ్ ఇండస్ట్రీస్, సన్‌రైజ్ సెక్టార్లకు గట్టి సపోర్ట్ ఇస్తోందని మోదీ అన్నారు. ఇది అసాధారణని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విశ్వసనీయమైన, ప్రపంచ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ క్వాలిటీ సప్లయిర్‌గా ఇండియా పాత్ర గణనీయంగా పెరుగుతోందన్నారు. భారతదేశం ఇటీవల కుదుర్చుకున్న 'మదర్ ఆఫ్ డీల్స్' ప్రయోజనాలు దేశ యువతకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు దక్కుతాయని అన్నారు. ఆ దిశగా ఈ బడ్జెట్‌లో కీలకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి

బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం

కేంద్ర బడ్జెట్ 2026.. మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద పీట

Updated Date - Feb 01 , 2026 | 03:27 PM