Share News

బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:35 PM

బడ్జెట్ 2026లో భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో భారత క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

బడ్జెట్ 2026:  ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం
Khelo India Mission

ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ 2026లో భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో భారత క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్రీడలను కేవలం పతకాల వరకే పరిమితం చేయకుండా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధికి కీలక రంగంగా తీర్చిదిద్దడమే ఈ మిషన్ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.


‘ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడా ప్రతిభను వ్యవస్థబద్ధంగా పెంపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చే పదేళ్లలో క్రీడారంగాన్ని పూర్తిగా మార్చే ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ఖేలో ఇండియా మిషన్ ద్వారా అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.


2030, 2036 లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు

2030లో అహ్మదాబాద్ వేదికగా జరిగే 100వ కామన్వెల్త్ గేమ్స్, అలాగే 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకుంది. పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో క్రీడలలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ‘ఖేలో ఇండియా’ను జాతీయ గుర్తింపులో భాగంగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.


ఖేలో ఇండియా - ప్రయాణం

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2016–17లో రూపొందించిన ఈ ఖేలో ఇండియా.. 2018 జనవరిలో తొలి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్‌తో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభంలో ఒక్క ఈవెంట్‌కే పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పునరుజ్జీవింపజేసే ఉద్యమంగా మారింది. అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను గుర్తించి, శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహకారం అందించడం ద్వారా ఖేలో ఇండియా ఇప్పటికే వేలాది మంది యువ క్రీడాకారులకు దారి చూపింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ‘ఖేలో ఇండియా మిషన్’గా విస్తరించడంతో భారత క్రీడారంగంలో కొత్త యుగానికి నాంది పడినట్టేనని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

Updated Date - Feb 01 , 2026 | 02:36 PM