మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:43 PM
సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత, రాజ్యసభ ఎంపీ, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ (Sunetra Pawar) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM)గా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహాయుతి మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేతలు శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం పగ్గాలను సునేత్ర చేపట్టారు.

శాసనసభాపక్ష నేతగా...
దీనికి ముందు, శనివారం ఉదయం ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లెజిస్లేటివ్ బిల్డింగ్‌లో జరిగిన సమావేశంలో సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్‌సీపీ మంత్రి ఛగన్ భుజ్‌బుల్ బలపచారు. అనంతరం ఏకగ్రీవంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర ఎన్నికయ్యారు.
సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం పదవితో చేపట్టంతో అజిత్ పవార్ చేపట్టిన శాఖలను కూడా ఆమెకు అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే అజిత్ పవార్ చేతిలోని ఆర్థిక శాఖను మాత్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన వద్దే ఉంచుకోనున్నారని, దీనికి బదులుగా మరో శాఖను ఆమెకు అప్పగిస్తారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ అభినందనలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, దివంగత అజిత్‌దాదా పవార్ కలలను సాకారం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారనే నమ్మకం తనుకుందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్
ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక
For More National News And Telugu News