Share News

నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:51 PM

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.

నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్
Sharad Pawar

ముంబై: విమాన ప్రమాదంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఇటీవల కన్నుమూయడంతో ఆయన భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అజిత్ పవార్ బాబాయ్, ఎన్‌సీపీఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఎన్‌సీపీ, ఎన్‌సీపీఎస్‌పీ విలీనం కానున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో 'మహాయుతి' సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సునేత్ర సిద్ధమవుతుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


ఎలాంటి సమాచారం లేదు

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. 'ప్రమాణస్వీకారంపై నాకు ఎలాంటి సమాచారం లేదు' అని పవార్ తెలిపారు. పవార్ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ప్రమాణస్వీకారానికి హాజరవుతారా అనేది కూడా తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అజిత్ పవార్ వారసుని ఎన్నిక ప్రక్రియ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచారని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు సైతం ఆయన తనకు తెలియదని సమాధానమిచ్చారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరనే అభిప్రాయం పవార్ మాటల్లో వ్యక్తమైంది.


అజిత్ పవార్ 2023 జూలైలో పార్టీ నుంచి విడిపోవడంతో ఎన్‌సీపీలో చీలిక అనివార్యమైంది. అయితే తిరిగి రెండు పార్టీలు విలీనం కావాలని అజిత్ పవార్ ఆశించారని, గత డిసెంబర్ 12న పవార్ పుట్టినరోజు కానుకగా ఈ విలీనం జరగాలని ఆయన అనుకున్నప్పటికీ ఆ సమయంలో అది ఆచరణకు నోచుకోలేదని ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేతలు చెబుతున్నారు. విలీనం ప్రక్రియపై చర్చించేందుకు శరద్ పవార్, అజిత్ పవార్‌లు జనవరి 17న సమావేశమయ్యారని, ఫిబ్రవరి 12న దీనిపై ఒక ప్రకటన చేయాలని కూడా అనుకున్నారని తెలుస్తోంది. దీనిపై శరద్ పవార్‌ను అడిగినప్పుడు, చర్చలకు అజిత్ పవార్, జయంత్ పాటిల్ హాజరయ్యారని, దీనిపై పాటిల్ ఒక నిర్ణయం తీసుకుంటారని సమాధానమిచ్చారు.


ఇవి కూడా చదవండి..

రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?

ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం

For More National News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 03:46 PM