రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:44 AM
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.
న్యూఢిల్లీ, జనవరి 31: దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే యూనియన్ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇది.. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా ఒకే ప్రధాని నేతృత్వంలో సమర్పించనున్న తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్య తరగతి వేతనదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన విషయం కావడంతో ఈ బడ్జెట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆర్థిక సర్వే 2025-26ను జనవరి 29న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మోదీ 3.0 ప్రభుత్వం కింద రెండో పూర్తి స్థాయి బడ్జెట్(2024లో ఇంటరిమ్, 2025లో పూర్తి బడ్జెట్ తర్వాతది) కానుంది.
'వికసిత్ భారత్ @2047' లక్ష్యాన్ని ముందుంచుకుని ఆర్థిక సంస్కరణలు, కస్టమ్స్ డ్యూటీ మార్పులు, రుణ తగ్గింపు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఈ బడ్జెట్లో మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రాయితీలు, రక్షణ, వ్యవసాయం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో ప్రజలు, వ్యాపారవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 112 ప్రకారం.. ఏటా ఉభయ సభల ముందూ సమర్పించే ఈ ఆర్థిక ప్రకటనలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు, ఖర్చుల అంచనాలు, పన్ను ప్రతిపాదనలు, వ్యయ ప్రాధాన్యాలు, సంస్కరణలు, అభివృద్ధి చర్యలు వివరిస్తారు. కేంద్ర బడ్జెట్.. భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ప్రజలు, వ్యాపార సంఘాలు, మార్కెట్లు దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రసంగం తర్వాత వివిధ రంగాల్లో ప్రతిస్పందనలు, స్టాక్ మార్కెట్ రియాక్షన్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అనంతరం బడ్జెట్ మీద విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వ్యక్తమవుతాయి.
బడ్జెట్ తేదీ, సమయం:
తేదీ: ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: లోక్‌సభ, పార్లమెంట్ భవనం, న్యూఢిల్లీ
బడ్జెట్ ప్రసంగాన్ని ఎక్కడ చూడొచ్చు?
ఆర్థిక మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రజలు కింది మార్గాల ద్వారా లైవ్‌గా వీక్షించవచ్చు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు న్యూస్ ఛానల్
సంసద్ టీవీ(Sansad TV) - పార్లమెంట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం
దూరదర్శన్ (DD న్యూస్)
యూట్యూబ్ ఛానళ్లు - Sansad TV, PIB India
అధికారిక వెబ్‌సైట్ - indiabudget.gov.in
ఇంకా.. ఆంధ్రజ్యోతి సహా ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్లు, టీవీ ఛానళ్లు కూడా లైవ్ అప్డేట్స్ అందించనున్నాయి.
బడ్జెట్ 2026-27లో ఏయే కీలక అంశాలు ఉండొచ్చు?
ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మార్పులు - మధ్య తరగతి వారికి ఊరట కలిగించే నిర్ణయాలు
భారత ఆర్థిక వృద్ధి ప్రణాళికలు
రక్షణ, వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి సృష్టి
డిజిటల్ ఎకానమీ, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం
సామాజిక సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు
ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఆధారంగా ఈ బడ్జెట్‌లో కీలక విధాన నిర్ణయాలు ఉండనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. యూనియన్ బడ్జెట్ దేశ ఆర్థిక విధానాలకు మార్గదర్శకంగా ఉంటుంది. ప్రజల జీవన విధానం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి దిశను ఈ బడ్జెట్ నిర్ణయించనుంది.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్