Share News

బడ్జెట్2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

ABN , Publish Date - Jan 30 , 2026 | 08:44 AM

కొత్త పన్ను విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దీనికి మెరుగులు దిద్దే మరిన్ని మార్పులను వచ్చే బడ్జెట్‌లో ప్రవేశపెట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, భారీ మార్పులు మాత్రం ఉండబోవని చెబుతున్నారు.

బడ్జెట్2026.. కొత్త పన్ను  విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
Budget 2026 - Expections on Tax Cuts

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో, మరోసారి కొత్త పన్ను విధానంపై చర్చ మొదలైంది. కొత్త పన్ను విధానానికి మారిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు మరిన్ని ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. నూతన పన్ను విధానానికి ప్రభుత్వం కొంత కాలంగా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాత పన్ను విధానానికి క్రమంగా కేంద్రం దూరం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా 2025 బడ్జెట్ కీలక మలుపు అని అభివర్ణిస్తున్నారు. పన్ను విధానానికి కీలక మార్పులు చేసిన ప్రభుత్వం పన్ను పోటు నుంచి వేతన జీవులకు భారీ ఉపశమనం కల్పించింది (Budget 2026 - Changes to New Tax Regime).

పాత పన్ను విధానంలో మినహాయింపులు, రిబేట్‌లు వదులుకున్న వారికి లాభం చేకూర్చేలా ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పన్ను లెక్కింపు విధానం, దరఖాస్తు విధానాలను మరింత సరళతరం చేసేలా కొత్త పన్ను విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. 2024-25 నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు కొత్త విధానమే ప్రధానమైనదిగా మారింది. పాత విధానం నుంచి కొత్తదానికి మళ్లాలని ప్రభుత్వం పన్నుచెల్లింపుదార్లను తనవంతుగా ప్రోత్సహించింది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ, హెచ్ఆర్ఏ వంటి పలు డిడక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వద్దనుకుని కొత్త విధానానికి మారిన వారికి పన్ను భారం తగ్గేలా కొత్త విధానంలో శ్లాబ్స్‌ను రూపొందించారు.


ఇక 2025 బడ్జెట్ కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చిందని నిపుణులు చెబుతున్నారు. ట్యాక్స్ శ్లాబ్స్‌ను మరింత విస్తృత పరచడంతో మధ్యతరగతి వర్గానికి మేలు చేకూరింది. ఈ విధానంలో రూ.24 లక్షల పైచిలుకు వార్షిక ఆదాయం ఉన్న వారికే 30 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో, రూ.15 లక్షలు-రూ.24 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్న వారిపై పన్ను భారం చాలా వరకూ తగ్గింది. ఇక సెక్షన్ 87ఏ కింద ఇచ్చే రిబేట్ పరిమితి పెంపును మరో ముఖ్య సంస్కరణగా నిపుణులు చెబుతున్నారు. కొత్త విధానంలో రూ.12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు కూడా ఈ రిబేట్‌కు అర్హులుగా మారారు. ఫలితంగా, రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు దాదాపుగా ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయింది. పాత పన్ను విధానం ప్రకారం, ఈ రిబేట్‌ను రూ.7 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే వర్తింపజేసిన విషయం తెలిసిందే.

రిబేట్‌తో పాటు స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా కేంద్రం గత బడ్జెట్‌లో రూ.75 వేలకు పెంచింది. ఫలితంగా రూ.12.75 లక్షల ఆదాయం ఉన్న వారు కూడా పన్ను భారం నుంచి తప్పించుకోగలిగారు. వివిధ ఆదాయాలు ఉన్న వారికి శ్లాబ్స్ మారినప్పుడు ఒక్కసారిగా పన్ను భారం పెరగకుండా నూతన విధానాన్ని డిజైన్ చేశారని నిపుణులు చెబుతున్నారు.

గత బడ్జెట్‌లో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన తరుణంలో ఈసారి పన్ను విధానంలో భారీ స్థాయి మార్పులు ఉండే అవకాశం తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుత విధానానికి మెరుగులు దిద్దేలా స్వల్ప మార్పులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.


ఇవీ చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 30 , 2026 | 10:13 AM