నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:51 AM
రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యాహక్కులో భాగంగా.. నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం (రుతుక్రమ ఆరోగ్యం) మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యాహక్కులో భాగమే
పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించాలి
బడిలో ఆడ, మగపిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి
నెలసరి సమయంలో, యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహనకల్పించే పాఠాలను బోధించాలి
పురుష టీచర్లు, విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి
3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్లల్లో అమలు చేయాలి: సుప్రీం
న్యూఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యాహక్కులో భాగంగా.. నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం (రుతుక్రమ ఆరోగ్యం) మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరు నుంచి 12వ తరగతి వరకూ చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన ‘పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం రుతుక్రమ పారిశుధ్య విధానా’న్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. అందులో భాగంగా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మగ పిల్లలకు, ఆడ పిల్లలకు వేరువేరుగా శౌచాలయాలను ఏర్పాటు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థినులకు పర్యావరణ హిత శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేటు స్కూళ్ల గుర్తింపును రద్దుచేయాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయకపోతే అందుకు నేరుగా రాష్ట్రప్రభుత్వాలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించాలని, కనీస పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ తీర్పును వెలువరించింది. ‘‘ఒక పీరియడ్ (ఫుల్‌స్టాప్) వాక్యాన్ని ముగించాలి తప్ప.. బాలికల విద్యను కాదు’’ అన్న అమెరికన్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలిస్సా బెర్టన్ హృద్యమైన వ్యాఖ్యను ఉటంకిస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా 126 పేజీల తీర్పును ప్రారంభించారు. ‘‘రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద కల్పించన జీవించేహక్కులో రుతుక్రమ ఆరోగ్యం కూడా ఒక భాగమే. ఒక బాలిక అత్యున్నతమైన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సాధించడానికి.. సురక్షితమైన, ప్రభావవంతమైన, అందుబాటు ధరల్లో ఉండే నెలసరి ఆరోగ్య నిర్వహణ చర్యలు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవితాన్ని గడిపేహక్కులో భాగంగా.. లైంగిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే హక్కు, దానికి సంబంధించిన చదువును పొందే హక్కు కూడా ఉంటుంది’’ అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. కాగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం లభించే ‘విద్యాహక్కు’ను సుప్రీంకోర్టు ‘మల్టీప్లయర్ రైట్’గా (అంటే.. ఒక వ్యక్తి బాగా చదువుకుంటే, తద్వారా తనకున్న మిగతా అన్ని హక్కుల గురించీ తెలుసుకుంటారని అర్థం) అభివర్ణించింది.
మనిషి గౌరవంగా బతకాలన్నా, జీవించే హక్కును పూర్తిస్థాయిలో అనుభవించాలన్నా అది చదువు ద్వారానే సాధ్యమని తేల్చిచెప్పింది. అంతటి కీలకమైన చదువుకకు.. రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు దూరం కావాల్సిన పరిస్థితి వస్తోందని.. చదువు ఆగిపోవడం వల్ల వారు తమ ఇతర హక్కులను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వెలిబుచ్చింది. ప్రాథమిక విద్యా హక్కు, విద్యాహక్కు చట్టం అనేవి.. ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తాయని, అటువంటి విద్యను పొందడానికి అడ్డంకిగా మారే ఖర్చులు, రుసుములు ఏవైనా సరే ఈ హక్కు కిందకే వస్తాయని తేల్చిచెప్పింది (అంటే శానిటరీ ప్యాడ్లకు అయ్యే ఖర్చు వల్ల విద్యార్థినులు చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని దీని అర్థం).
కీలక ఆదేశాలు..
పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్య నిర్వహణ చర్యలు లేకపోవడం వల్ల బాలికల విద్య ఆగిపోకుండా పలు కీలక ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ ‘ఏఎ్‌సటీఎం డీ-6954’ ప్రమాణాలకు తగినట్టుగా తయారుచేసిన పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లను విద్యార్థినులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలనూ ఆదేశించింది. వాటిని కూడా.. మరుగుదొడ్ల ప్రాంగణంలోనే, వెండింగ్ మెషీన్ల ద్వారా అందుబాటులో ఉంచాలని, అలాంటి అవకాశం లేని చోట.. ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత అధికారి(టీచర్/ప్రిన్సిపాల్) వద్ద లభ్యమయ్యేలా చూడాలని పేర్కొంది. ఇంకా..
ప్రతి పాఠశాలలోనూ పనిచేసే స్థితిలో ఉన్న, ఆడ-మగ పిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లు, నిరంతర నీటి సౌకర్యంతో ఉండేలా చూడాలని ఆదేశించింది. అలాగే.. పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న, కొత్తగా కట్టబోయే మరుగుదొడ్లను.. విద్యార్థుల గోప్యతను కాపాడేలా, దివ్యాంగులతో సహా పిల్లలందరి అవసరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.
పాఠశాలలో ఉన్నప్పుడు నెలసరి వస్తే బాలికలు ఇబ్బంది పడకుండా.. అత్యవసర చర్యల్లో భాగంగా అన్ని పాఠశాలలూ రుతుక్రమ ఆరోగ్య నిర్వహణ కార్నర్లు ఏర్పాటుచేయాలి. వాటిలో అదనపు లోదుస్తులు, అదనపు యూనిఫారాలు, వాడిన శానిటరీ న్యాప్‌కిన్లను పారేయడానికి వీలుగా డిస్పోజబుల్ బ్యాగులు, ఇతరత్రా అవసరమైన అన్ని వస్తువులనూ ఆయా కార్నర్లలో ఉంచాలి. ప్రతి పాఠశాలలోనూ వాడేసిన శానిటరీ న్యాప్‌కిన్లను పారవేయడానికి సురక్షితమైన, పరిశుభ్రమైన, పర్యావరణానికి హాని కలిగించని యంత్రాంగం ఉంచేలా చర్యలు తీసుకోవాలి.
‘రుతుక్రమ ఆరోగ్యం, యవ్వనదశపై అవగాహన, శిక్షణ’ అనే అంశంపై పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని.. నెలసరి సమయంలో, యవ్వనదశలో వచ్చే మార్పులు, ఆరోగ్య సమస్యలపై లింగ సున్నితత్వంతో కూడిన పాఠ్యాంశాలను చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ), స్టేట్ కౌన్సిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ)లకు ఆదేశాలు జారీచేసింది.
పాఠశాలల్లో మౌలికవసతులు.. ముఖ్యంగా మరుగుదొడ్లు, శుభ్రం చేసుకునే వసతులు ఉన్నాయా లేవా? శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో ఉన్నాయా? వాడిన న్యాప్‌కిన్లను సురక్షితంగా పారేసే ఏర్పాట్లు ఉన్నాయా? లేవా? అనే అంశాలపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది.
..తీర్పు వెలువడిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ ఆదేశాలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. అలా అమలవుతున్నాయా లేదా ఎప్పటిప్పుడు పర్యవేక్షించాలని జాతీయ, రాష్ట్రాల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లను కోరింది.
‘మునగ’ ప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్!
రుతుస్రావం సమయంలో మహిళలు మూత్రనాళ సమస్యలు, బ్యాక్టీరియల్ వాగినోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి బారిన పడే ప్రమాదం ఉంది. అయితే నెలసరి అప్పుడు మునగ మొక్క (మోరింగా) సారాల ఆధారిత శ్యానిటరీ ప్యాడ్‌లను వినియోగించడం వలన ఈ రిస్క్‌ను తగ్గించే అవకాశం ఉందని ప్రముఖ గైనకాలజిస్టులు, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి సహజమైనవని, చర్మ స్వభావానికి అనుకూలం (స్కిన్ ఫ్రెండ్లీ)గా ఉంటాయని తెలిపారు. సంప్రదాయ వైద్యంలో మునగ చెట్టును ఒక ‘అద్భుతమైన వృక్షం’గా చెబుతుంటారు. ఇది దానిలోని విస్తృత శ్రేణి బయో యాక్టివ్ సమ్మేళనాలకు ప్రసిద్ధి చెందింది. దీని వలన పలు ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. వాటిల్లో పరిశుభ్రత, నెలసరి సంరక్షణకు సంబంధించిన యాంటీ మెక్రోబియాల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు వంటివి ఉన్నాయి. సాధారణ ఔషధాలతో పోలిస్తే మునగ ఆకుల సారాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చర్యను ప్రదర్శించినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.