కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:11 PM
కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రశంసిస్తూ పౌర విమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థిరమైన ఆర్థిక విధానం, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని అన్నారు.
ఢిల్లీ, ఫిబ్రవరి1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1న) ఆర్థిక బడ్జెట్ 2026-27ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌పై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) కూడా నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రశంసించారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశాభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. బడ్జెట్‌పై ఆయన ప్రకటన విడుదల చేశారు. విదేశీ టూర్లపై పన్ను తగ్గింపు పౌర విమానయాన రంగానికి మరింత ఊతమిస్తుందని తెలిపారు. 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్' లక్ష్యాలను మరింత వేగంగా చేరుకునేందుకు సాయపడుతుందని అన్నారు. అదేవిధంగా పౌర విమానాల విడిభాగాలపై ట్యాక్స్ తగ్గించడం శుభపరిణామమని తెలిపారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ స్థిరమైన ఆర్థిక విధానంతో పాటూ పెట్టుబడులు (investment), సంస్కరణలపై ప్రత్యే దృష్టి పెట్టడం ద్వారా.. దేశానికి మరింత ప్రగతిని, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని ఆయన అన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులను మరింత ఆకర్షిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏడు నగరాల మధ్య హై స్పీడ్ కారిడార్లు, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందివ్వడం.. ఇలా బడ్జెట్ 2026-27లోని ప్రతి అంశం ప్రగతిని సూచిస్తోందని అన్నారు.
2026-27కి కేంద్ర పెట్టుబడులను గతంలో కంటే అధికంగా రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా ప్రభుత్వం తన విజన్ ఏంటనేది స్పష్టం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇది ఉపాధి, పెట్టుబడులు, పెట్టుబడిదారుల నమ్మకానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక తోడ్పాటు అందిస్తూ ఏపీకి సైతం సింహభాగం కేటాయింపులు జరగడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన పంటగా ఉన్న కొబ్బరి పంటకు తోడ్పాటు అందించే విధంగా తీసుకున్న నిర్ణయం.. ఉద్దాన ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా జీడి పంటకు కూడా తోడ్పాటు నిధులు కేటాయించడం శుభపరిణామమని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి
బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం
కేంద్ర బడ్జెట్ 2026.. మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద పీట