అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోలేను
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:19 AM
బీఆర్‌ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన హయాంలోనే
నా నియోజకవర్గంలో అభివృద్ధి: పోచారం
కామారెడ్డి/బాన్సువాడ: బీఆర్‌ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రె్‌సలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ విషయం చెప్పడానికి తానేమీ వెనుకాడబోనని అన్నారు. అన్నం పెట్టిన వారిని మరిచిపోలేమని చెప్పారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ.. నియోజకవర్గంలో కొంతమంది వ్యవహార శైలి, తనను పెట్టిన ఇబ్బందులు, మారిన రాజకీయ పరిస్థితుల వల్లే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు.
మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మంజీరా చెక్‌డ్యాం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ పోచారం ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, మూడు రంగుల జాతీయ కండువాను కప్పుకొన్నానని తెలిపారు. మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో తాను పార్టీ మారలేదన్నారు. రెండేళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి.. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడించారని, తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి.. ఆరు నెలల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోపాటు ఇతర మంత్రులకూ చెప్పారని పేర్కొన్నారు. కానీ, ముఖ్యమంత్రి హామీ నేటికీ నెరవేరలేదని, సీఎం చెప్పినా మంత్రులు తన ఫోన్ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ముఖ్యమంత్రి మాట కూడా వినడం లేదన్నారు. బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సగంలోనే నిలిపివేశారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే
Read Latest AP News And Telangana News And International News And Telugu News