Share News

రాజధానికి సిగ్నేచర్‌!

ABN , Publish Date - Aug 12 , 2026 | 06:32 AM

రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్ఠాత్మకపైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏజీఐసీఎల్‌) శ్రీకారం చుట్టాయి,..

రాజధానికి సిగ్నేచర్‌!

  • అమరావతికి గేట్‌ వేగా ఐకానిక్‌ బ్రిడ్జ్‌

  • అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

  • రూ.వెయ్యి కోట్ల మేరకు వ్యయ అంచనా

  • మంగళవారం ముగిసిన ప్రీ-బిడ్‌ మీటింగ్‌

  • ఈ నెల 26 వరకు బిడ్‌ దాఖలుకు గడువు

గుంటూరు(రాజధాని), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్ఠాత్మకపైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏజీఐసీఎల్‌) శ్రీకారం చుట్టాయి. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరుతూ ఏజీఐసీఎల్‌ కొద్దిరోజుల క్రితం టెండర్లను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాయపూడిలోని ఏజీఐసీఎల్‌ కార్యాలయంలో కన్సల్టెన్సీలతో ప్రీ-బిడ్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ వంతెనను ప్రస్తుతం నిర్మించిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుతో అనుసంధానించడం ద్వారా అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించనున్నారు. ఏజీఐసీఎల్‌ టెండర్ల ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి ‘సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌’గా పేరును ఖరారు చేశారు. హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయరహదారి(ఎన్‌హెచ్‌-65), విజయవాడ నగరాలతో అమరావతి అనుసంధానాన్ని మెరుగుపరచనున్నారు. దీనికిగాను బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, అంటే ప్రకాశం బ్యారేజీ, రైలు బ్రిడ్జిలకు మధ్యలో సిగ్నేచర్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. సీతానగరం ఘాట్‌ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ద్వారా, మచిలీపట్నం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్‌-65) అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపడతారు. రాజధానికి గేట్‌వేగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వంతెనను ఆరు వరుసల రహదారులతోపాటు, రెండువైపులా ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాన్సెప్ట్‌, డిజైన్లు, వ్యయ అంచనాల ఆధారంగా ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ నిర్మిస్తుంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్‌లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి.


ఐకానిక్‌ డిజైన్స్‌..

ఈ సిగ్నేచర్‌ బ్రిడ్జి పొడవు 1.10 కిలోమీటర్లు ఉంటుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను నేరుగా కలిసేలా సీతానగరం ఘాట్‌ రోడ్డు నుంచి ఎలివేటెడ్‌ కారిడార్‌ విధానంలో బ్రిడ్జిని డిజైన్‌ చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే సీతానగరం ఘాట్‌ మీదగా అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు చేరుకోవడం వాహనదారులకు మరింత సులువు కానుంది. నిర్మాణ వ్యయం రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించనున్నారు. గతంలో అమరావతి-మూలపాడు వద్ద నిర్మించే బ్రిడ్జిని సిగ్నేచర్‌ బ్రిడ్జిగా నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పలు నమూనాలను విడుదల చేసింది. బ్రిడ్జికి ఆ డిజై న్లు వాడే అవకాశం ఉంది.

‘కూచిపూడి’ భంగిమలతో..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కూచిపూడి నృత్య భంగిమలతో రూపొందించిన ఆ డిజైన్లు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అమరావతికి గేట్‌ వేగా మారే ఈ బ్రిడ్జి అత్యంత కీలకమైందికావడంతో తెలుగు వారి సాంస్కృతిక వారసత్వమైన కూచిపూడి భంగిమలతో బ్రిడ్జిని నిర్మించే అవకాశం ఉంది. కాగా, రాష్ట్ర ఆర్థిక, పర్యాటక రంగాల పురోగతికి ఈ సిగ్నేచర్‌ బ్రిడ్జి బలమైన పునాదిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 06:32 AM