ఆయిల్ పామ్‌తో కాసుల వర్షం
ABN , Publish Date - Jun 24 , 2026 | 01:31 PM
ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్‌పామ్ పంట తెరపైకి వచ్చింది.
జిల్లాలో 2 వేల ఎకరాల నుంచి 6వేల ఎకరాల్లో సాగు
టన్ను ధర రూ.23,852
ఏర్గట్ల(నిజామాబాద్): ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్‌పామ్ పంట తెరపైకి వచ్చింది. జిల్లాలో దశల వారీగా సాగుచేస్తున్న రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొదట్లో 2వేల ఎకరాల సాగు నుంచి ప్రస్తుతం 6వేల500 ఎకరాలకు పెరిగింది. గతంలో మెట్రిక్ టన్నుల ఆయిల్ పామ్ రూ.18వేల ధర ఉండగా, ప్రస్తుతం రూ.23వేల 852 పెరి గింది. దీంతో ఆయిల్‌పామ్ రైతులు సంబురపడుతున్నారు.
రూ.3 కోట్ల మేరకు అమ్మకాలు..
జిల్లాలో నాలుగేళ్లుగా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ దిగుబడులు రైతులకు పెద్ద ఎత్తున చేతికి వస్తున్నాయి. ఎలాంటి చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకపోవడంతో దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.3కోట్ల విలువైన పంటను రైతులు విక్రయించినట్లు అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో పడ్డాయి.
పంట మార్పిడి వైపు రైతుల అడుగులు..
జిల్లాలో ప్రతీ వానా కాలం, యాసంగిలో రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి సారం కోల్పోవడమే కాకుడా ఎక్కువగా పంట పండటం వల్ల సరైన ధర రాక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి పంట మార్పిడిని తప్పనిసరిగా పాటించాలంటూ ప్రభుత్వం సూచనిలిస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా మంచి ధర ఉండటం, కంపెనీ బాయ్ బ్యాక్, సాగులో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆయిల్‌పామ్ వైపే రైతులు మొగ్గుచూపు తున్నారు.
నెల నెలా ఆదాయం..
వ్యవసాయంలో ఏ పంటకు లేని విధంగా ఆయిల్‌పామ్ పంట పెట్టుకున్న రైతులకు నెలనెలా ఆదాయం వస్తుంది. రెండు ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట పెట్టుకున్న రైతు సరైన సాగు మెలకువలు 3 సంవత్సరాల వరకు పాటిస్తే 36 నెలల తరువాత మొదటి కోత మొదలవుతుంది. అలా ప్రతీ 25 రోజుల కొకసారి గెలలు కోయవచ్చు. కోసిన ప్రతీసారి ఆ నెల టన్ను ధర ప్రకారంగా రైతు ఖాతాలో డబ్బులు జయచేయబడతాయి.
మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి గ్రామవాసి బోడ మహేందర్‌కు 2002లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఎకరాల స్థలం ఇచ్చింది. మూడు సంవత్సరాల క్రితం ఆ స్థలంలో ఆయిల్ పామ్ పంటను మొదలు పెట్టాడు. ప్రభుత్వం సబ్సిడీతో ఒక చెట్టు రూ.20 ఇవ్వడంతో 50 చెట్లను తీసుకువచ్చాడు. అయితే ఆ స్థలంలో సుమారు ఆరు, ఏడు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాడు. మూడు సంవత్సరాలు కష్టపడటంతో ఇప్పుడు చెట్లకు కాయలు కాస్తున్నాయని మహేందర్ తెలిపారు. సంవత్సరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టానని వివరించారు. ఈ చెట్లు కాత కాస్తే 30 సంవత్సరాల వరకు పంట వస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రతీనెల రూ.30వేల నుంచి రూ.40వేల వరకు లాభం వస్తుందని ఆయన తెలిపారు.
వ్యవసాయమే కానీ ఉద్యోగం చేసినట్టుంది..
ఏలేటి సత్యం, రైతు, ఏర్గట్ల
నేను 2022 సంవత్సరంలో 6 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట నాటుకున్నా. గత యేడాది జూలై నుంచి గెలలు కోయడం మొదలు పెట్టా. ఇప్పటి వరకు దాదాపు 13 టన్నుల దిగుబడి తీసుకున్నా. ప్రతీ నెల గెలలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయంతో వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసినుట్లు అనిపిస్తోంది.
కొత్త రైతులకు సువర్ణావకాశం..
రుద్ర వినాయక్, డివిజనల్ ఉద్యాన అధికారి, బాల్కొండ
ఆయిల్ పామ్‌పై ఆసక్తి ఉన్న కొత్త రైతులకు ప్రభుత్వం రాయితీను కల్పిస్తోంది. మెక్కలపై 90శాతం సబ్సిడీ, డ్రిప్ పరికరాలకు ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు, చిన్న సన్న కారు రైతులకు 80 శాతం సబ్సిడీని ఇస్తుంది. ఒకసారి నాటితే 25-30 ఏళ్లపాటు ఆదాయం ఇస్తుంది. ప్రతీ నెల కోత ఉంటుంది
ఈ వార్తలు కూడా చదవండి:
భాగ్యనగరంలో కోతుల బీభత్సం.. మహిళపై దాడి, తీవ్ర గాయాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News