Share News

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:54 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

హృదయానికి గమ్యం దొరికింది.. కాబోయే భర్తను చంపేముందు రొమాంటిక్ పోస్ట్‌లు..
Pune death Mystery

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హత్యకు ముందు వరకు కాబోయే భర్తపై ప్రేమను చాటేలా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. లవ్ ప్రపోజల్, ప్రేమగా పూలు ఇవ్వడం, కౌగిలించుకోవడం, 'అధికారికంగా పెళ్లి చేసుకున్నాం' అనే ట్యాగ్.. ఇలా నెలల తరబడి ఒక పరిపూర్ణమైన ప్రేమను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో చూపించింది (Pune death Mystery).


సియా, కేతన్‌లకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం అంగరంగ వైభవంగా నవంబర్‌లో జరగాల్సి ఉంది. నిశ్చితార్థం జరిగిన నెల రోజుల తర్వాత, సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొవ్వొత్తులతో ఉన్న కేక్ ఫొటోను పోస్ట్ చేసి, 'నా హృదయం తన గమ్యాన్ని చేరి నెల రోజులు అయిన సందర్భంగా శుభాకాంక్షలు' అనే క్యాప్షన్ పెట్టి, కేతన్‌ను ట్యాగ్ చేసింది. ఆ తర్వాత మే నెలలో కూడా కేతన్ గురించి పలు రొమాంటిక్ పోస్ట్‌లు పెట్టింది (Siya Goyal, Ketan Agarwal).


మే 19న కేతన్, సియా ఒక రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేశారు. అదే రోజున సియా తన పుట్టిన రోజు కౌంట్‌డౌన్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఒక నెల తర్వాత, సియా పుట్టినరోజుకు సరిగ్గా ఒక్కరోజు ముందు వీరి కథ వేరే మలుపు తీసుకుంది. కేతన్ లోయలో పడి మరణించాడు. కేతన్ మరణించిన తర్వాత సియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'నా పుట్టినరోజునే నన్ను విడిచిపోయావు' అంటూ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టింది (Romantic Instagram Posts of Siya Goyal).


గతేడాది ఒక వ్యాపార సమావేశంలో పరిచయమైన 22 ఏళ్ల చేతన్ చౌధరితో సియా ప్రేమాయణం సాగించిందని విచారణలో వెల్లడైంది. సియా బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు. కేతన్‌ను పెళ్లి చేసుకోవడానికి సియా ఇష్టపడలేదని, చేతన్‌తో తన సంబంధానికి అతడిని ఒక అడ్డంకిగా భావించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే కేతన్‌ను అడ్డు తొలగించుకోవడానికి ఇద్దరూ పథకం వేశారు. గతంలో కూడా కేతన్‌పై పలు హత్యాయత్నాలు చేశారు. అయితే అప్పుడు కేతన్ తప్పించుకున్నాడు (Pune crime news).

pune3.jpg


పోలీసుల కథనం ప్రకారం.. ప్లాన్ ప్రకారమే కేతన్‌ను సియా జూన్ 18న లోహగడ్ కోటకు రప్పించింది. ఆ తర్వాత చేతన్‌ అక్కడికి వచ్చాడు. అతడు ఆ జంటను సుమారు 20-30 అడుగుల దగ్గర నుంచి అనుసరించాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతన్ హుడీ ధరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లిన తర్వాత వారిద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి తోసేశారు. గత ఏడు నెలల్లో సియా, చేతన్‌లు దాదాపు 238 గంటల పాటు 2,004 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.


ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు


భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 24 , 2026 | 12:59 PM