నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:14 AM
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు (Green Card holders) సంబంధించిన కీలక కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు (Green Card holders) సంబంధించిన కీలక కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు దేశంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో సరిహద్దు అధికారులు అదనపు విచారణ చేయవచ్చని, అవసరమైతే ప్రవేశాన్ని నిరాకరించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ కేసుల్లో వారు నేరం చేసి ఉండొచ్చని నమ్మడానికి బలమైన కారణం ఉన్నట్టు అధికారులు నిర్ధారించాల్సి ఉంటుంది (US Supreme Court).
చైనా మూలాలు కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్ ముక్ చోయ్ కేసుకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన సమయంలో నకిలీ వస్తువుల విక్రయానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడిని సాధారణ శాశ్వత నివాసిగా కాకుండా ప్రత్యేక పరిశీలన కింద దేశంలోకి అనుమతించారు. అధికారుల నిర్ణయాన్ని అతడు కోర్టులో సవాలు చేశాడు. చివరకు ఈ వివాదం అమెరికా అత్యున్నత న్యాయస్థానానికి చేరింది (US immigration law).
ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది (Green Card news). అమెరికాకు తిరిగి వస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్‌పై నేరారోపణలు ఉంటే సరిహద్దు అధికారులు అతడిని తిరిగి వస్తున్న శాశ్వత నివాసిగా కాకుండా, ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న కొత్తగా వ్యక్తిగా పరిగణించవచ్చని పేర్కొంది. నేరం పూర్తిగా రుజువై ఉండాల్సిన అవసరం లేకుండానే సంబంధిత చట్టాల ప్రకారం విచారణ చేపట్టే అధికారం అధికారులకు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. అయితే సాధారణ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ఈ తీర్పు వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన వివాదాలు లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికే ఈ తీర్పు శరాఘాతం కానుంది.
ఈ వార్తలనూ చదవండి:
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఈడీ సోదాలు