Share News

సిరిసిల్ల, సిద్దిపేటపై దండయాత్ర

ABN , Publish Date - Sep 06 , 2026 | 03:35 AM

తెలంగాణ తులసివనంలో చీడలా ఉన్న బీఆర్‌ఎస్‌ గంజాయి మొక్కను పీకేస్తామని.. త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బావ, బావమరుదులు బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, చెంచాగాళ్లని రప్పించుకుంటారో తేల్చుకోవాలని సవాల్‌ చేశారు.

సిరిసిల్ల, సిద్దిపేటపై దండయాత్ర
Teachers Revanth Reddy

  • ఈ రెండు చోట్ల త్వరలో భారీ సభలు..

  • అక్కడా కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం

  • కేసీఆర్‌ కాస్కో.. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే

  • అసెంబ్లీకి రా.. లేకపోతే రాజీనామా చేసి తప్పుకో..

  • ప్రజల పన్నుల డబ్బును దొబ్బితింటున్న

  • నాయకుడిని డిస్మిస్‌ చేయాలా... వద్దా?

  • సొంత ఆడబిడ్డను గెంటేసిన వాడిది సంస్కారమా?

  • 30నెలల్లో రైతులకు రూ.1.70లక్షల కోట్లు బదిలీ

  • 2034లోగా కోటీశ్వరులుగా కోటిమంది ఆడబిడ్డలు

  • నల్లగొండ జిల్లా నకిరేకల్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ తులసివనంలో చీడలా ఉన్న బీఆర్‌ఎస్‌ గంజాయి మొక్కను పీకేస్తామని.. త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బావ, బావమరుదులు బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, చెంచాగాళ్లని రప్పించుకుంటారో తేల్చుకోవాలని సవాల్‌ చేశారు. ‘‘కేసీఆర్‌ కాస్కో.. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. సవాల్‌ చేసి చెబుతున్నా.. ఇప్పుడున్న 119 సీట్లతోనే ఎన్నికలొస్తే 90 స్థానాలు, సీట్లు పెరిగితే 117 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది. 2034 వరకు ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది. కేసీఆర్‌.. రాసి పెట్టుకో.. మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్‌ లేదు. ఇక చీకటే’’ అని స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.345 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం నకిరేకల్‌ మినీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేటల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పారు. ఈ నెలాఖరులో సిరిసిల్లలో, వచ్చే నెలలో సిద్దిపేటపై దండయాత్ర చేస్తామని.. కాంగ్రెస్‌ శ్రేణుల అండతో పార్టీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పారు. విపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని, లేకపోతే గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోవాలని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, వెయ్యి రోజుల తమ ప్రజాప్రభుత్వ పాలనపై అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘1000 రోజుల ప్రభుత్వంలో కేసీఆర్‌ ఒక్కరోజైనా సభకు రాలేదు. కానీ రూ.22,24,40,000 జీతభత్యాలు, ఉండటానికి ఇల్లు, తిరగడానికి కారు ప్రభుత్వం నుంచి తీసుకుని ఫాంహౌ్‌సకు వెళ్లిపోయారు. ప్రజల చెమట, రక్తంతో కట్టిన పన్నుల డబ్బును దొబ్బితింటున్న ఈ నాయకుడిని డిస్మిస్‌ చేయాలా, వద్దా.. ప్రజలు ఆలోచించాలి’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అధికారులు 365 రోజులు పనిచేయకపోతే తీసేస్తారని, వెయ్యిరోజులు పనిచేయని నాయకుడినిఏం చేయాలని ప్రశ్నించారు.


ఆడబిడ్డను గెంటేయడం సంస్కారమా?

రేవంత్‌రెడ్డికి చదువురాదని, సంస్కారం లేదని బావ, బావమరుదులు మాట్లాడుతున్నారని.. ఇంటి ఆడబిడ్డకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోంచి మెడపట్టి గెంటేయడమే సంస్కారమా? అని నిలదీశారు. ‘‘రాఖీ పండుగ రోజు సీతక్క, సురేఖ అక్క నా ఇంటికి వస్తే సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టించుకుని గౌరవించిన సంస్కారం నాది. దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.పదివేల కోట్లయినా సొంత చెల్లెకు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో రాఖీనాడు ఊళ్లోలేకుండా పారిపోయినవాడిది ఏం సంస్కారం? కొడుకు గంజాయి తాగివచ్చి సొంత చెల్లెలిని ఇంట్లోంచి వెళ్లగొడితే.. కొడుకు దవడలు పగలగొట్టి దారిలో పెట్టాల్సిన తండ్రి, తనను, భార్యని ఎక్కడ కొడతాడోననే భయంతో ఫాంహౌస్‌కు పారిపోయాడు. అలాంటి వ్యక్తి పాలన మళ్లీ ఈ రాష్ట్రానికి కావాలా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. పామును తోక తొక్కి వదిలేయవద్దని కాంగ్రెస్‌ కార్యకర్తలు చెబుతూనే ఉన్నారని.. కానీ తానే ఉపేక్షించానని చెప్పారు.


మా పాలనను పోల్చిచూసుకోండి..

వెయ్యి రోజుల కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వ పాలనను, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను విజ్ఞులైన ప్రజలు పోల్చుకోవాలని సీఎం రేవంత్‌ సూచించారు. 2014లో బీఆర్‌ఎస్‌ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని, ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోలేదని గుర్తు చేశారు. తమ ప్రజాప్రభుత్వం వచ్చాక 25,35,000 మంది రైతులకు రూ.80,617 కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. దీనిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. రైతుభరోసా కింద రూ.36 వేల కోట్ల నగదు బదిలీ చేశామని, సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామని, ఉచిత విద్యుత్‌కు ఏటా రూ.15వేల కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందుకోసం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.11వేల కోట్లు చెల్లించామని చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాగా, నకిరేకల్‌లో అద్భుతంగా సభ నిర్వహించారని ఎమ్మెల్యే వీరేశంను సీఎం రేవంత్‌ అభినందించారు.


మా పథకాల లబ్ధిదారుల్లో బీఆర్‌ఎస్‌ నేతలూ ఉన్నారు

తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.06 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని, మొత్తం 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు పొందినవారిలో, 3.48 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారుల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, సానుభూతిపరులు కూడా ఉన్నారని.. వారికి సన్నబియ్యం, రేషన్‌కార్డులు ఇవ్వకుండా తామేమీ ఆపలేదని స్పష్టం చేశారు. రైతులకిచ్చిన రూ.90 వేల కోట్లలో బీఆర్‌ఎస్‌ వారి నుంచి కొన్న ధాన్యం కూడా ఉందని చెప్పారు. రూ.36 వేల కోట్ల రైతు భరోసా పొందినవారిలోనూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారని.. వారెవరూ ఈ పథకం తమకొద్దని డబ్బులు వదిలేయలేదని గుర్తుచేశారు.


సీఎం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌తో పలు సందర్భాల్లో విభేదించడమే కాకుండా, సీఎం జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. నకిరేకల్‌ సభలో పాల్గొన్నారు. సీఎం, మంత్రుల కంటే ముందే వచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. సీఎం, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌తో అభివృద్ధి కార్యక్రమాల్లో, సభలో పాల్గొన్నారు. సభావేదికపై సీఎంకి శాలువాకప్పి సన్మానించారు. నకిరేకల్‌లో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి.. సభకు హాజరుకాకుండా హైదరాబాద్‌ వెళ్లారు.


ప్రతి నాయకుడికీ, కార్యకర్తకు గుర్తింపు: ఉత్తమ్‌

బీఆర్‌ఎస్‌ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొని నిలబడిన, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2028 జూన్‌లోగా పూర్తిచేస్తామన్నారు.


పేదల అభ్యున్నతి మా ధ్యేయం: మహేశ్‌గౌడ్‌

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కుటుంబ ప్రభుత్వం కొనసాగిందని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రభుత్వం కొనసాగుతోందని పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక సర్వాయి పాపన్న, జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గత పాలనలో గద్దర్‌ను గేటు వద్ద నిలబెట్టి అవమానించారని, ఈ ప్రభుత్వం ఆయన పేరుతో పురస్కారాలిచ్చి గౌరవిస్తోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సెంటు సీసాలు పడేస్తున్నారా?

అడ్డుకునేవారే లేరు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 03:37 AM