Share News

అడ్డుకునేవారే లేరు..

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:08 AM

‘మమ్మల్ని అడిగేదెవరు..? మా వాహనాన్ని ఆపేదెవరు..?’ అనే విధంగా జిల్లాలో ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాల జోరు అంతకంతకు పెరుగుతోంది. ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్‌, సరకు బస్తాలు, ఇతరత్రా సామగ్రి కంటైనర్లు యథేచ్ఛగా పలు రహదారులపై పరుగులు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న వీటిపై పోలీసులు, రెవెన్యూ, రవాణా, మైనింగ్‌ శాఖల అధికారుల పర్యవేక్షణ కరువైంది.

అడ్డుకునేవారే లేరు..

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

‘మమ్మల్ని అడిగేదెవరు..? మా వాహనాన్ని ఆపేదెవరు..?’ అనే విధంగా జిల్లాలో ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాల జోరు అంతకంతకు పెరుగుతోంది. ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్‌, సరకు బస్తాలు, ఇతరత్రా సామగ్రి కంటైనర్లు యథేచ్ఛగా పలు రహదారులపై పరుగులు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న వీటిపై పోలీసులు, రెవెన్యూ, రవాణా, మైనింగ్‌ శాఖల అధికారుల పర్యవేక్షణ కరువైంది. సామర్థ్యానికి మించి సరుకును తీసుకెళ్తున్న వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. మాట వరుసకైనా తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో రోడ్డు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగతున్నాయి.

ఇదంతా ‘మామూళ్ల’ వ్యవహారమే..

జిల్లాలో అధికలోడ్‌తో వాహనాలు వెళ్తున్నా ఆర్టీఏ, పోలీసులు పట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఈ అధికలోడ్‌ల వ్యవహారంపై కొందరు నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రోడ్లపై వెళ్లే లారీలను ఆపి అనుమానం ఉంటే వాటిని వే బ్రిడ్జి వద్ద తూకం వేయించాలి. వే బిల్లులో వాహనంలో ఉన్న బరువుకు తేడా ఉంటే చర్యలు తీసుకోవాలి. జిల్లాలో రోడ్లపై వేబ్రిడ్జిలు చాలా చోట్ల లేనే లేవు. ఒకవేళ అధికారులు ఎక్కడైనా అనుమానంతో లారీని పట్టుకున్నా.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా కొన్ని లారీలను ఆపడానికి యూనిఫాం సిబ్బంది సాహసించడం లేదనే విమర్శలున్నాయి. కొందరు నెలవారీగా మామూళ్లు ముట్టజెప్పుడుతుండడంతో ఇదంతా షరా మామూలు వ్యవహారమనే మాటలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. నిర్ణీత బరువును మించి ఏ వాహనాన్ని అయినా ఆపి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించవచ్చు. జిల్లాలో మొక్కుబడిగానే ఈ కేసులను నమోదు చేస్తున్నారు. గట్టిగా నిఘా పెట్టి చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తే నెలలో కనీసం వందకుపైగా కేసులు నమోదయ్యే అవకాశముంది. కానీ ఏడాది మొతత్తంగా అన్ని శాఖలకు సంబంధించి కనీసం వంద కేసులు కూడా నమోదవ్వట్లేదు.!

పరిమితిని మించి ’రయ్‌’మంటూ...

ఆరుటైర్ల సామర్థ్యమున్న వాహనంలో నిబంధనల ప్రకారం 16,200 కిలోలు ఉండాలి. మరో ఐదు శాతం అదనపు బరువుకు అనుమతి ఉంటుంది. పది టైర్ల వాహనంలో 24,500 కిలోలు, 12 టైర్ల వాహనంలో 36 వేల కిలోలకు మించకూడదు. వీటన్నింటిలో నిబంధనలను అతిక్రమించి 15 నుంచి 25 శాతం బరువును అధికంగా నింపుతుంటారు. ఇసుక లారీల్లో రీచ్‌ల వద్ద ఐదారు ఎక్స్‌కావేటర్‌ బకెట్లను ఎక్కువగా పోసుకుని రవాణా చేస్తుంటారు. కంకర, మట్టి విషయంలో బరువు విషయంలో లెక్కలేనితనమే జిల్లాలో ప్రతినిత్యం కనిపిస్తుంది. ఇక వీటి వేగం విషయంలో సరైన నియంత్రణ లేకపోవడంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్‌లోడ్‌తో సంబంధం లేకుండా డ్రైవర్లు విచ్చలవిడిగా వీటిని నడుపుతుండటంతో అదుపుతప్పి బోల్తాపడిన సందర్భాలున్నాయి.

దారులన్నీ గుంతలమయమే..

జిల్లాలో ఉన్న రాజీవ్‌ రహదారితోపాటు జాతీయరహదారులు, పీఆర్‌, ఆర్‌ఆండ్‌బీ రోడ్లన్నీ ఎక్కువ లోడ్‌తో వెళ్తున్న లారీల కారణంగా ధ్వంసమవుతున్నాయి. మోకాళ్లలోతు గుంతలు ఏర్పడుతున్నాయి. రోడ్డు పరిమిత సామర్థ్యానికి రెండింతల సరకుతో లారీలు వెళ్తుండటంతో వేసిన కొన్నిరోజులకే పాడైపోతోంది. మళ్లీ మళ్లీ మరమ్మతులు చేసినా రోడ్లు అసలు రూపాన్ని కోల్పోయి ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోనుంచి ఇసుక, మట్టిని తీసుకెళ్తున్న లారీల వల్ల ఊళ్లలోకి వెళ్లాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఇటీవల వీణవంక మండలంలో అధికలోడ్‌తో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు వాహనాలను అడ్డగించి ఆందోళన చేపట్టారు. ఇక రోడ్లు పాడవుతున్నా ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు సదరు వాహనాలపై చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలను అతిక్రమించే ప్రతి వాహనానికి జరిమానా విధించే అవకాశమున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.

Updated Date - Sep 06 , 2026 | 01:08 AM