Thefts Case: సంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం..
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:26 PM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్‌గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్‌గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీలు జరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సంక్రాంతి పండగకు కుటుంబ సభ్యులు ఊరెళ్లి, తిరిగి వచ్చేలోపు ఖాళీగా ఉన్న ఇళ్లను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.
భారీ చోరీలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నర్సింగ్ రావు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువాలను పగలగొట్టి 14 తులాల బంగారం, 12 తులాల వెండి చోరీ చేసి పరారయ్యారు. భారీ మొత్తంలో ఆభరణాలు మాయమవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అదే కాలనీలోని ధనుంజయ్ ఇంట్లోనూ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి 4 కిలోల వెండి, 2 గ్రాముల బంగారం దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. అలాగే, రాజ్ కుమార్ లౌడియా ఇంట్లోకి చొరబడిన దొంగలు, బంగారు చైన్, రింగులు చోరీ చేశారు. ఈ వరుస చోరీలతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్‌లోని రోడ్డు నంబర్ 5 పరిధిలో మరికొన్ని ఇళ్లల్లో కూడా దొంగలు చోరీ చేసినట్లు సమాచారం. ఒకే గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు దొంగలు ఈ ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిమిషాల్లోనే..
స్థానికులు, సీసీ కెమెరాల ఆధారంగా చూస్తే మియాపూర్ వైపు నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దొంగల కదలికలు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ వరుస దొంగతనాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలు ముఖాలను కప్పుకుని, వేగంగా ఇళ్లలోకి చొరబడి నిమిషాల్లోనే చోరీ చేసి పరారైనట్లు తెలిపారు. బాధిత కుటుంబాలు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, కాల్ డేటా, బైక్ వివరాల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. వరుస చోరీలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పండుగల సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలపై పోలీసులు నిఘా పెంచాలని కాలనీవాసులు కోరుతున్నారు. త్వరగా నిందితులను పట్టుకుని, తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కుక్కల్ని చంపడం దారుణం: రేణూ దేశాయ్
తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News