సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్
ABN , Publish Date - May 09 , 2026 | 01:28 PM
తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.
సిద్దిపేట, మే 9: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ తీరు చూస్తే పని తక్కువ.. హడావుడి ఎక్కువ అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే 150 మీటర్లకు ఒప్పందం కుదిరిందని మంత్రి వివేక్ చెబుతున్నారని.. మరి అప్పుడే ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదని ప్రశ్నించారు. తమతో ఒప్పందం లేకుండా పని చేస్తే పనులు వృథా అవుతాయని కిరణ్ కుమార్ రెడ్డికి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాశారని గుర్తుచేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని.. మరోవైపు తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారని మాజీ మంత్రి తెలిపారు. ఇంతకీ ఎవరు చెప్పింది కరెక్ట్ అని నిలదీశారు. తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే మహారాష్ట్రకు తానే వెళ్లి మాట్లాడినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల అయినా మహారాష్ట్రతో మాట్లాడటం లేదని అన్నారు. ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా తుమ్మిడిహెట్టికి ఒప్పించలేదని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోని రూ.17 వేల కోట్లు ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ రూ.40 వేల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌కు ఇప్పటికే రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెబుతున్నారని మాజీ మంత్రి అన్నారు. ఇది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఊసరవెల్లి లెక్క మాట మారుస్తున్నారని మండిపడ్డారు. 30 నెలల్లో మేడిగడ్డలో మూడు పిల్లర్లను మరమ్మతు చేయడం చేతకాలేదని విమర్శించారు. ఇప్పటికే మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీళ్లు కిందకు వెళ్తున్నాయని చెప్పారు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అని తుమ్మిడిహెడ్డి డ్రామా ఆడుతున్నారని హరీశ్ ఆరోపించారు. ఎల్ నినో కరువు వస్తుందని దేశం అంతా చెబుతోందని.. కరువు కారు చీకటిలో వెలుగు దివ్వె కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరాన్ని తక్కువ చేస్తే అక్కడ కొలువైన ముక్తేశ్వరుడు తగిన బుద్ధి చెబుతాడని హెచ్చరించారు. డ్రామాలు కట్టిపెట్టి మేడిగడ్డ మూడు పిల్లర్లు రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ కేసులు, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయని కేంద్రం నివేదిక ఇచ్చిందని హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్‌లో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రమే అనేక సార్లు చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపులకు పోలీసులను వాడుకుంటున్నారన్నారు. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు
సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విడుదల
Read Latest Telangana News And Telugu News