KTR: కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తాం: కేటీఆర్
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:53 PM
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లలో ఎవరికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్, జనవరి 12: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) నాయకత్వంలో అన్ని పట్టణాలు అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తెలిపారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుపడేసిందని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని, పంచాయతీలకు ట్యాంకర్లలో నీరు, ట్రాక్టర్లలో డీజిల్ కూడా లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 40 సీట్లు వచ్చిన బీఆర్ఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆ జిల్లాలను ముట్టుకున్నారో...
రూ.73 వేల కోట్లతో రైతుబంధు పథకం తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, కాంగ్రెస్ గత పథకాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లలో ఎవరికీ న్యాయం జరగలేదని అన్నారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తామని ఓ మంత్రి చెబుతున్నారని, జిల్లాలను ముట్టుకుంటే అగ్గిపుట్టిస్తామని హెచ్చరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు..
బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం..
పాలమూరును మైగ్రేషన్ జిల్లా కాకుండా ఇరిగేషన్ జిల్లాగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు అని వ్యాఖ్యలు చేశారు. ‘పాలమూరుకి రాబోయే రేవంత్ రెడ్డి.. జిల్లాకు ఒక్క ప్రాజెక్టు తెచ్చావా?.. మేం తెచ్చిన ప్రాజెక్టులు ఎందుకు పారిపోయాయో చెప్పాలి’ అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కొడంగల్‌తోపాటు పాలమూరులో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, అన్ని వర్గాల్లో ఆనందం నిండాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలతోనే జైత్రయాత్ర కొనసాగాలని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి...
అందుకే ఉపాధి హామీ పథకం పేరు మార్పు: కేంద్ర మంత్రి
సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహ బుద్ధి బయటపడింది: హరీష్ రావు
Read Latest Telangana News And Telugu News