Share News

CM Revanth Reddy: దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:04 PM

ప్రణామ్ కార్యక్రమం ద్వారా వృద్ధులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని ఆయన హెచ్చరించారు.

CM Revanth Reddy: దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్, జనవరి 12: దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు వివాహం చేసుకున్నా.. ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. సమాజంలో ఆత్మగౌరవంతో వారు నిలబడేలా తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తోందని తెలిపారు. ఒక కుటుంబసభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.


ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని జీవితంలో ఎదగాలని దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు స్ఫూర్తి.. కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. వైకల్యం అనే ఆలోచనను దరి చేరనీయకుండా.. ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. సోమవారం బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లోని ప్రజాభవన్ వేదికగా మూడు కొత్త సంక్షేమ పథకాలు.. చిన్నారుల కోసం బాల భరోసా, వృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రూ.50కోట్లతో దివ్యాంగులకు సహాయక పరికరాలు పంపిణీ చేశామని వివరించారు.


ప్రణామ్ కార్యక్రమం ద్వారా వృద్ధులను ఆదుకుంటామన్నారు రేవంత్. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని హెచ్చరించారు. అందుకోసం ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు సైతం తీసుకు వస్తామన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని మనమే దారిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులపై బాధ్యత లేని వారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


ఇక ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో-ఆప్షన్ మెంబర్‌గా ఒక ట్రాన్స్‌జెండర్‌ని కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని సూచిస్తున్నానన్నారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.


వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకు రాబోతున్నామన్నారు. తెలంగాణ సమాజం.. సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోందన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించామని చెప్పారు. తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించిందని గుర్తు చేశారు.


తెలంగాణ కులగణన మోడల్‌ను దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు సీఎం. తమ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ఈ ప్రజాభవన్‌లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందని.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామంటూ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 06:08 PM