Kishan Reddy: అందుకే ఉపాధి హామీ పథకం పేరు మార్పు: కేంద్ర మంత్రి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:39 PM
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని.. మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరును మార్చామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 12: ఉపాధి హామీ పథకాన్ని తీసేశారంటూ బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో గతంలో చాలా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒక సంవత్సరం ఒకచోట గుంతలు తవ్వితే మరుసటి ఏడాదీ అదే ప్రాంతంలో తవ్వేవారని విమర్శించారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని.. మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరును మార్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మన్రేగా పథకం.. ఇకపై వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ(వీబీ-జీ రామ్ జీ) పేరుతో కొనసాగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. వీబీ-జీ రామ్ జీ ద్వారా గోడౌన్‌లు నిర్మించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. అలాగే వ్యవసాయ రంగానికి దీనిని అనుసంధానం చేస్తామని కూడా మంత్రి వివరించారు. పని ఇవ్వలేని పరిస్థితుల్లోనూ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఇది కేవలం గుంతలు తవ్వే పథకం కాదు.. దేశాన్ని అభివృద్ధి చేసే పథకం’ అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
గ్రామ పంచాయతీలకు అమలు అధికారం కల్పించామని, పని దినాలను 100 నుంచి 125కు పెంచామన్నారు మంత్రి. రాష్ట్రాలకు అదనపు నిధులు వచ్చేలా చేస్తున్నామని వివరించారు. దివ్యాంగులు, వృద్ధులకు కూడా ఉపాధి హామీ కార్డులు ఇస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో తాజా ఆదేశాలివే..
భారీగా చైనీస్ మాంజా సీజ్.. 57 మంది అరెస్ట్
Read Latest Telangana News And Telugu News