కోటిమందికి ఇందిరమ్మ చీరలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:10 AM
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
చిలుకపచ్చగా.. ఆకర్షణీయ డిజైన్లు..
మన చేనేతల ద్వారా తయారీ
సిద్ధమైన రెండు రకాల చీరలు
పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు
రేపు అచ్చంపేటలో పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేత కార్మికులతో ఈ చీరలను తయారు చేయించి.. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను కానుకగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనుంది.
మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిచ్చారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు. 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలను పొందేందుకు అర్హులని ప్రభుత్వం తెలిపింది.
జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చీరలను పంపిణీ చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. పారదర్శకంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్లో లబ్థిదారుల వివరాలను నమోదు చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News