పాలమూరుకు మళ్లీ పాత కరువు రోజులు
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:42 AM
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే పాలమూరులో పాత కరువు రోజులు కనిపిస్తున్నాయని బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ లీడర్ టి.హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
పాలన గాలికొదిలి ఢిల్లీకి సీఎం రేవంత్ మూటలు
అల్వాల రైతన్నల రణభేరి సభలో హరీశ్‌రావు
వనపర్తి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే పాలమూరులో పాత కరువు రోజులు కనిపిస్తున్నాయని బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ లీడర్ టి.హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా అల్వాలలో సోమవారం జరిగిన రైతన్నల రణభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనను గాలికొదిలేసి.. హైదరాబాద్ టూ గోవా, బెంగళూరు, ఢిల్లీ అంటూ తిరుగుతూ మూటలు మోస్తున్నారన్నారు. కృష్ణా జలాలతో తడవాల్సిన పాలమూరు పంటలెండిపోతుంటే.. ఆ నీటిని ఏపీకి తరలించుకుపోతున్నా సర్కారు పట్టించుకోవట్లేదన్నారు. తాను పాలమూరు బిడ్డనని సీఎం రేవంత్ డైలాగులు చెప్పడం తప్పా.. జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. రైతు కొండయ్య మూడెకరాలతోపాటు ఒక్క వానాకాలంలోనే రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు.
కల్వకుర్తి పథకంలోని 5 పంపులు నడిపితే.. ప్రతి నెలా 10.5 టీఎంసీల చొప్పున 5 నెలల్లో 50 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కానీ సర్కారు నిర్లక్ష్యంతో 18 టీఎంసీల నీరే ఎత్తి పోసిందని, కల్వకుర్తి మోటార్లు తొమ్మిది గంటలే నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతుంటే సర్కారు చోద్యం చూస్తోందన్నారు. శ్రీశైలం నుంచి విడుదలైన నీటిని ఏపీ సర్కారు ఒడిసిపట్టి 700 కి.మీ దూరంలోని కుప్పం వరకూ తీసుకెళితే.. 70 కి.మీ దూరంలోని పాలమూరు రైతుకు నీళ్లివ్వలేదన్నారు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టలేదని, పెండింగ్ ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్న సర్కారు.. రైతులను ఎలా ఆదుకుంటుందో స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డికి సెలవునిచ్చే చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న హరీశ్... రైతులకు నష్టపరిహారం ప్రకటించకపోతే అసెంబ్లీలో గల్లా పట్టి పోరాటం చేస్తామని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News