Share News

గోల్డ్‌ లోన్‌ కొంత చెల్లించండి!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:56 AM

బంగారం ధరలు భారీగా తగ్గుతుండడం.. బ్యాంకుల్లో బంగారంపై రుణాలు తీసుకున్నవారికి సంకటంగా మారింది.

గోల్డ్‌ లోన్‌ కొంత చెల్లించండి!

  • లేదంటే అదనంగా బంగారం తాకట్టు పెట్టండి

  • మొత్తం రుణం చెల్లించైనా మళ్లీ తీసుకోండి

  • గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి బ్యాంకుల సందేశం

  • బంగారం ధరలు తగ్గుతుండటంతో నోటీసులు

  • మరింత తగ్గితే రికవరీ కష్టమనే ఈ చర్యలు

మహబూబ్‌నగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బంగారం ధరలు భారీగా తగ్గుతుండడం.. బ్యాంకుల్లో బంగారంపై రుణాలు తీసుకున్నవారికి సంకటంగా మారింది. బంగారం ధర గరిష్ఠంగా ఉన్న సమయంలో గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారు ఇప్పుడు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. లేదంటే అదనంగా మరికొంత బంగారమైనా తెచ్చి పెట్టాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి 2025 నుంచి 2026 మార్చి మధ్యలో బంగారంపై రుణాలు తీసుకున్నవారికి బ్యాంకర్లు ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నారు. ప్రైవేటు తాకట్టు సంస్థలైతే మరో అడుగు ముందుకేసి తమ వద్ద కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. వాస్తవంగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వడ్డీ చెల్లించకుండా, రెన్యువల్‌ చేయకుండా అలాగే ఉంచితే.. హెచ్చరిక సందేశాలు పంపుతారు.


అయినా వినకపోతే ఆ బంగారాన్ని వేలం వేస్తారు. అయితే రుణం తీసుకుని ఆరు నెలలు కూడా గడవక ముందే వేలం నోటీసులు వస్తున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటం, ఇంకా తగ్గుతాయనే అంచనాలు ఉండడమే ఇందుకు కారణం. బంగారం ధర గరిష్ఠంగా ఉన్న సమయంలో ఎల్‌టీవీ (లోన్‌ టూ వాల్యూ) ప్రకారం రుణం ఇచ్చిన బ్యాంకులు.. ఇప్పుడు పుత్తడి ధర తగ్గడంతో ఆందోళన చెందుతున్నాయి. దాదాపు 11 నెలల్లోనే పుత్తడి ధర సుమారు రూ.56 వేల వరకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.80 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.1.26 లక్షలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.16 లక్షల వరకు తగ్గింది.


రుణ స్థాయిని బట్టి రుణాలు..

సాధారణంగా బ్యాంకర్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రుణ స్థాయిని బట్టి బంగారంపై 75 శాతం నుంచి 85 శాతం వరకు రుణాలు ఇస్తాయి. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల రుణం వరకు గరిష్ఠంగా బంగారం మొత్తం విలువలో 85 శాతం ఎల్‌టీవీ ఇస్తారు. రూ.5 లక్షల వరకు రుణమైతే బంగారం విలువలో 80 శాతం, ఆపైన రుణమైతే 75 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, చాలా బ్యాంకులు ఆ మేరకు కూడా ఇవ్వవు. బంగారం ధరలు ఈ ఏడాది గరిష్ఠంగా ఉన్న సమయంలో బ్యాంకులు 24, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు రుణం ఇచ్చిన దాఖలాలున్నాయి. కానీ, ఇప్పుడు బంగారం ధర భారీగా పడిపోతుండటంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి.


ఉదాహరణకు ఒక వ్యక్తికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ఆభరణంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.20 లక్షల వరకు రుణం ఇచ్చారనుకుంటే... దానికి వడ్డీతో కలిపి ఎల్‌టీవీ విలువ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 10 గ్రాముల 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర రూ.1.16 లక్షల వరకు తగ్గింది. అంటే దాదాపు లోన్‌ టూ వాల్యూ 100 శాతం కంటే ఎక్కువ. వడ్డీ కలుపుకొంటే ఇది మరింత పెరుగుతుంది. బంగారం ధర ఇంకా పడిపోతే.. తాకట్టు పెట్టుకున్న బంగారం కంటే అతడు కట్టాల్సిన మొత్తం ఎక్కువ అయి.. లోన్‌ రికవరీ కష్టమనే భావనకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వచ్చాయి. దీంతో మెసేజ్‌లు పెడుతూ రుణంలో కొంత మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే రుణం తీసుకున్న మూడు నెలలకే మెసేజ్‌లు, నోటీసులు వస్తుండడంతో గోల్డ్‌లోన్‌ తీసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:56 AM