Share News

‘బతికుండగా మీరు అధికారంలోకి రారు’.. హరీశ్‌పై మంత్రి తుమ్మల ఫైర్

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:02 PM

బీఆర్ఎస్‌లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.

‘బతికుండగా మీరు అధికారంలోకి రారు’.. హరీశ్‌పై మంత్రి తుమ్మల ఫైర్
Minister Tummala Nageswara Rao

ఖమ్మం, ఏప్రిల్ 20: మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై మట్టి కొట్టి మన్ను పోశారని ఆరోపించారు. రాజకీయ పార్టీలను మోసం చేసి, ప్రజలను వంచించి, వ్యవస్థలను దోచుకున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీల విలువలను కాదని, పూర్వీకుల మాట పక్కన పెట్టి అహంకారంతో, దౌర్జన్యంతో పాలన చేశారని మంత్రి అన్నారు.


హరీశ్ రావుకు ఒక్కటే పని...

ఒక్కొక్కరిపై వందల కేసులు పెట్టి, కబ్జా కోరులు కబ్జా చేసిన స్థలంలో మీటింగ్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని తుమ్మల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో ఆయన మానసిక స్థితి సరిగా లేదన్నారు. హరీశ్ రావు మానసిక వేధనతో బాధపడుతున్నారని, అది దౌర్భాగ్యమో లేక మరేదైనా కావచ్చని మంత్రి అన్నారు. ఆయనకు ఒక్కటే పని.. ఎక్కడికి వెళ్లినా ఒకే ఆవు కథ, ఒకే రికార్డింగ్ క్యాసెట్ వినిపించడమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఇంకా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదు..

పదవి పోయిన బాధలో, అస్తిత్వంతో టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలను విమర్శిస్తున్నారని తుమ్మల తెలిపారు. ‘మీ అహంకారంతో రాష్ట్రంలో వ్యవస్థలను సర్వనాశనం చేశారు. మీరు, మీ కుటుంబం, మీ తాబేదారులు రాష్ట్రాన్ని దోచుకున్నారు’ అని ఆరోపించారు. ప్రజలు అధికారానికి దూరం పెట్టినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. సీతారామ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌ లేదన్నారు. ‘సీతారామ నా రాజకీయ ఆకాంక్ష.. నా జీవిత లక్ష్యం’ అని స్పష్టం చేశారు. పూజ్యులు రాజశేఖర్ రెడ్డి దుమ్ముగూడెం పేరుతో పనులు చేపట్టారని.. ఆయన మరణానంతరం ఆగిపోయిందని చెప్పారు. కేంద్రం, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉండాలంటే కాదని.. గోదావరినే రిజర్వాయర్‌గా చూపించారని ఆయన అన్నారు.


కమీషన్ల కోసమే పనులు..

బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్ట్ డిజైన్ లోపభూయిష్టంతో, కమీషన్ల కోసం అవసరమైన పనులు మాత్రమే చేపట్టారని మంత్రి విమర్శించారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వంద కోట్లతో గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌లో నింపామన్నారు. సత్తుపల్లి టన్నెల్‌కు రేవంత్ రెడ్డి రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కనీసం హెడ్ వర్క్స్ లిఫ్ట్ కూడా బీఆర్‌ఎస్ పూర్తి చేయలేకపోయిందని.. వారి నిర్వాకంతో జూలూరు పాడు టన్నెల్‌కు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావాల్సి వస్తోందని చెప్పారు.


అన్నీ దోచుకున్నారు...

ఎన్నికల ముందు వందల పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో ఆ పనులన్నీ పూర్తి చేయిస్తున్నారని వివరించారు. హరీశ్ హెల్త్ మినిస్టర్‌గా తన పోర్ట్‌ఫోలియోలో సీఎం రిలీఫ్ ఫండ్ దండుకున్నారని, చివరకు దళిత బంధు కూడా దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ దోపిడీ, అవినీతిని గుర్తించి ప్రజలు మీకు చరమగీతం పాడారు. బతికి ఉండగా మీరు అధికారంలోకి రారు’ అని స్పష్టం చేశారు. ‘హరీశ్‌కు అక్కడ టీఆర్ఎస్‌లో స్థానం లేదు. మొన్న వరంగల్ మీటింగ్‌లో కూడా నిన్ను పక్కన పెట్టారు. కనీసం నీ ఫోటో కూడా వరంగల్‌లో లేదు. కాలేశ్వరరావు పేరు పెట్టుకున్న నీకు కాలేశ్వరం ప్రారంభోత్సవానికి కనీసం పిలుపు లేదు. అక్కడ నీకు చోటు లేదు. రెండేళ్ల క్రితం మంత్రివర్గంలో నీ పేరు లేదు’ అని గుర్తు చేశారు.


వారి శాపనార్థాలు పట్టించుకోం...

రుణ మాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర సృష్టించారని మంత్రి తుమ్మల వెల్లడించారు. 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రుణ మాఫీపై విమర్శలు చేసే హక్కు హరీశ్‌కు లేదన్నారు. భారతదేశంలో రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కబ్జాలు, కమీషన్ల గురించి బీఆర్‌ఎస్‌కు తెలిసినంత ఏ పార్టీకి తెలియదన్నారు. సిద్దిపేటలో ఆరు నెలల్లో అత్యాధునిక టెక్నాలజీతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. అవినీతి పరుల విమర్శలు, శాపనార్థాలు పట్టించుకోమని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని, రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని జాతులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 03:11 PM