Share News

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:24 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును అన్న క్యాంటీన్ల సీఈఓకు సీఎం చంద్రబాబు సమక్షంలో నారా భువనేశ్వరి ఆదివారం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు.


అమరావతి రూపశిల్పి చంద్రబాబు: అచ్చెన్నాయుడు

సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకత్వం, అపారమైన దూరదృష్టి సీఎం చంద్రబాబు ప్రత్యేకత అని ప్రశంసించారు. అభివృద్ధి పట్ల ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించే నాయకుడు ఆయన అని అభివర్ణించారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పెద్దన్నలా అండగా నిలిచే వ్యక్తిత్వం సీఎం చంద్రబాబు సొంతమన్నారు. రాజధాని అమరావతి రూపశిల్పిగా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు అని వివరించారు.

సాంకేతికత, పారదర్శకతతో అభివృద్ధికి మార్గదర్శకుడిగా ఆయన నిలుస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతోపాటు దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ రథసారథి చంద్రబాబు: నారాయణ

నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ రథసారథి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్‌ సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అమరావతిని అజరామరం చేసి సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


రాజకీయ క్షేత్రంలో అలుపెరుగని పోరాటయోధుడు సీఎం చంద్రబాబు నాయుడు: ఏపీ బీజేపీ చీఫ్

రాజకీయ క్షేత్రంలో అలుపెరుగని పోరాటయోధుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి నిత్యం భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరిన్ని జరుపుకోవాలని పేర్కొన్నారు.


నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు చంద్రబాబు: మంత్రి సవిత

సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీబీఎన్.. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు అని అభివర్ణించారు. రాజకీయాల్లో అలుపెరగని యోధుడని పేర్కొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడని ప్రశంసించారు. యావత్తు జాతి మెచ్చిన రాజకీయ అభ్యుదయ వాది చంద్రబాబు అని చెప్పారు. 76లో అడుగుపెడుతున్న చంద్రన్నకు రాష్ట్రంలోని మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మంత్రి సవిత తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులు సీఎం చంద్రబాబుపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి సవిత కోరుకున్నారు.


ప్రజా రాజధాని అమరావతి రూపకర్త సీఎం చంద్రబాబు: మంత్రి సత్య ప్రసాద్

ప్రియతమ నాయకుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా నవ్యాంధ్రను అగ్రగామిగా నిలపడంలో సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీని దేశంలోనే అత్యంత పటిష్టవంతమైన కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దిన నేత సీఎం చంద్రబాబు అని గుర్తు చేశారు. సమైక్యాంధ్రలో విజన్ 2020 పేరుతో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ‌గా మార్చారని పేర్కొన్నారు.


నవ్యాంధ్రను విజన్ 2047 పేరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రజా రాజధాని అమరావతి రూపకర్తగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజాసేవకే అంకితమైన చంద్రబాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

Updated Date - Apr 20 , 2026 | 08:35 AM