టమాటా ధర ఢమాల్
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:08 PM
టమాటా ధర తగ్గిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతన్నాడు. గత పది. పదిహేనురోజుల క్రితం వరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉండగా ప్రస్తుతం పడిపోయింది.
- ఒక్కసారిగా దిగజారిన రేటు
- 25కిలోల బాక్సు 150 రూపాయలే..
- అధిక వర్షాలతో పడిపోయిన దిగుబడులు
- గిట్టుబాటు కాని పెట్టుబడులు.. కుదేలవుతున్న రైతులు
జూలూరుపాడు(భద్రాద్రి కొత్తగూడెం): మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు సాగు చేసి చతికిలబడిన భద్రాద్రి(Bhadradri) జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటగా టమాటాసాగు వైపు చూపు మళ్లించారు. గత ఏడాది ఆశలు రేకెత్తించిన టమాటా సాగును నమ్ముకొని అదే ఆశతో ఈ ఏడాది సాగును ముందస్తుగానే చేపట్టారు. కానీ వారి ఆశలను అధిక వర్షాలు చిదిమేశాయి. దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 500ఎకరాలలో రైతులు టమాటా సాగు చేపట్టారు. పంట చేతికందే దశలో అధిక వర్షాలు కురవడంతో పంట దెబ్బతినడంతో టమాటాకు అధిక ధర పలికింది. దీంతో రబీలో రైతులు (యాసంగి పంట గా) రైతులు గత మూడు నెలల క్రితం టమాటా సాగు వైపు మొగ్గు చూ పారు.
దీంతో పంట సాగు విస్తీర్ణం జిల్లాలో ఖరీఫ్ తో పోల్చుకుంటే పెరిగింది. రబీలో ఈ ఏడాది 800 ఎకరాలలో టమాట పంటను రైతులు సాగు చే శారు. జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ములకలపల్లి తదితర మండలాల్లోని పలువురు రైతులు పంట సాగు చేపట్టారు. ప్రస్తుతం పంట రైతుల చేతికందేసరికి ఒక్కసారిగా ధర పడిపోవడంతో నివ్వెరపోయారు. గత 20 రోజుల క్రితం వరకు 25 కేజీల టమాటాబాక్స్ రూ. 800 నుంచి 1000 వరకు ధర పలికింది. ప్రస్తుతం అదే బాక్స్ రూ. 150లు మాత్రమే పలుకుతుండడంతో రైౖతులు డీలా పడుతున్నారు. టమాటా సాగు చేపట్టిన రైతులు ఎకరానికి రూ. 3లక్షల వరకు పెట్టుబడి పెట్టి పంటను పండించినప్పటికీ గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ధర అమాంతంగా తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తగ్గిన దిగుబడులు.. గిట్టుబాటు కాని పెట్టుబడులు
ఈఏడాది అధిక వర్షాలు నమోదు కావడంతో పంట దిగుబడులు తగ్గిపోయాయి. గత ఏడాది ఎకరానికి 40టన్నుల దిగుబడి రాగా.. ఈ ఏడాది సగానికి తగ్గి కేవలం 20టన్నులు మాత్రమే లభించడంతో రైతులు కుదేలైపోతున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలించి విక్రయించిన కూలీలకు చెల్లించిన సొమ్ము కూడా రావడం లేదు. దీంతో కొంత మంది రైతులు పం టను మార్కెట్‌కు తరలించలేక పశువులకు వేస్తున్నారు. పెట్టుబడులు వ చ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులపాలు కావల్సి వస్తోందని రైతులు వా పోతున్నారు. అధిక వర్షాలు పంటను నాశనం చేయగా.. కాలం కలిసి రాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.

పెట్టుబడి కూడా దక్కడం లేదు
సిరిగద్దె నరిసింహారావు, రైతు, జూలూరుపాడు
ఈ ఏడాది కౌలుకు తీసుకొని ఖరీఫ్‌లో రెండున్నర ఎకరాలలో పందిరి పద్ధతిలో టమాటా సాగు చేశా. ఎకరానికి రూ. 3 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టా. పంట కాపు దశలో ఉన్న సమయంలో అధిక వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. తీరా ఇప్పుడు పంట వచ్చేసరికి ధర పూర్తిగా తగ్గిపోయింది. 25కేజీల బాక్స్ ధర కేవలం రూ. 150లు మాత్రమే పలుకుతుండడంతో.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. స్థానికంగా వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతుండడంతో ఖమ్మం మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. ఈ ఏడాది టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టపోయా.
అధిక వర్షాలే కొంప ముంచాయి
అనుమళ్ల రాధాకృష్ణ, రైతు, జూలూరుపాడు
ఈ ఏడాది అనూహ్యంగా నమోదైన అధిక వర్షపాతం వల్ల టమాటా రైతుల ఆశలు గల్లంతయ్యాయి. టమాటాకు మంచి ధర ఉంటుందని ఆశపడి పంట సాగు చేసినప్పటికీ.. కాలం కలిసి రాకపోవడంతో భంగపాటు తప్పలేదు. దీంతో అప్పులపాలు కావాల్సి వచ్చింది.
టమాటా సాగుతో తీవ్రంగా నష్టపోయా..
భూక్యా నాగేశ్వరరావు, రైతు, లైన్‌తండా
టమాటా సాగు సిరులు కురిపిస్తుందని ఆశపడి 1.20 కుంటల విస్తీర్ణంలో పంట సాగు చేపట్టి రూ. 3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆశపడి టమాటా సాగు చేసి అప్పులపాలు అయ్యాను. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News